పోలీసులు వేధిస్తున్నారని రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

పోలీసులు వేధిస్తున్నారని  రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

గద్వాల, వెలుగు: తన పొలాన్ని విడిచిపెట్టి పోవాలంటూ పోలీసులు వేధిస్తున్నారని ఓ రైతు కుటుంబం శుక్రవారం గద్వాల కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. కలెక్టర్ ​కారుకు అడ్డంగా కూర్చుని పురుగుల మందు తాగబోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. కేటీ దొడ్డి మండల పరిధిలోని ఇర్కిచేడ్ గ్రామానికి చెందిన బాధిత రైతు పెద్ద జయప్ప కథనం ప్రకారం..జయప్పకు గ్రామంలో తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన 6.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో సాగు చేసుకుంటుండగా కొంతకాలంగా కేటీ దొడ్డి ఎస్సై వెంకటేశ్​తో పాటు పోలీసులు వచ్చి పొలం వదిలేసి పోవాలని వేధిస్తున్నారు.

బతుకుదెరువు కోసం జయప్ప బెంగళూరుకు వెళ్లినా వదల్లేదు. మూడు రోజుల క్రితం గద్వాల బీసీ హాస్టల్​లో చదువుతున్న జయప్ప పిల్లలను పీఎస్​కు తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న జయప్ప ఇర్కిచేడ్​కు రాగా గురువారం పోలీసులు పొలం నుంచి బయటకి పంపించారు. దీంతో శుక్రవారం కొత్త కలెక్టరేట్​కు భార్య లక్ష్మి, పిల్లలు శివరాజు, వినోద్, ఉమేశ్​తో వచ్చి కలెక్టర్ వాహనం ముందు పురుగుల మందు డబ్బాతో బైఠాయించాడు. తాగబోగా పోలీసులు అడ్డుకుని కలెక్టర్​సీసీని కలిపించారు. జయప్ప మాట్లాడుతూ రెండేండ్ల నుంచి వేధిస్తున్నా భరిస్తున్నానని, నెల రోజుల నుంచి మితిమీరిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందని జయప్ప కన్నీటి పర్యంతమయ్యాడు. సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని చెప్పి పంపించారు.