నడిగడ్డలో ...మారుతున్న రాజకీయం

నడిగడ్డలో ...మారుతున్న రాజకీయం
  • కారు దిగనున్న జడ్పీ చైర్ పర్సన్, బండ్ల సమీప బంధువులు

గద్వాల, వెలుగు: ఎన్నికలకు ఆరు నెలల ముందే జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతోంది. రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్  పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. గద్వాల జడ్పీ చైర్​పర్సన్  సరిత, ఎమ్మెల్యే బంధువులు, ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న ఆయన సోదరులు కారు దిగేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్  టికెట్  కోసం జూబ్లీహిల్స్ లో మాజీ ఎంపీ మల్లు రవితో మంతనాలు జరపగా, బుధవారం ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో హైదరాబాద్ లో సీక్రెట్ గా మీటింగ్  నిర్వహించారు. ఇందులో డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్ భర్త తిరుపతయ్య పాల్గొని పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డిని శుక్రవారం జడ్పీ చైర్​పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య కలిసి చేరికను ఖరారు చేసుకున్నారు. 

బీఆర్ఎస్​కు షాక్..

బీఆర్ఎస్ లో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న లీడర్లు కాంగ్రెస్​ పెద్దలతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి సమీప బంధువులు కూడా బీఆర్​ఎస్​ను వీడేందుకు సిద్ధమయ్యారు. ముందుగా జడ్పీ చైర్​పర్సన్  దంపతుల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరితోపాటు గట్టు, ధరూర్ మండలాలకు చెందిన మండల స్థాయి లీడర్లు వెంట నడిచే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు మండలాలకు చెందిన కీలక వ్యక్తులు, గద్వాల పట్టణానికి చెందిన వారు కాంగ్రెస్​లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్​కు షాక్​ తగులుతుందని అంటున్నారు.

బీసీ నినాదంతో చీలికలు..

బీఆర్ఎస్ లో బీసీ పాలిటిక్స్, బీ టీమ్​ పాలిటిక్స్ తో గందరగోళం నెలకొంది. బీసీ నినాదాన్ని ఎత్తుకున్న జడ్పీ చైర్​పర్సన్  దంపతులు కాంగ్రెస్​ టికెట్​ బీసీలలో ఎవరికి ఇచ్చినా మద్దతిస్తామని స్పష్టంగా చెబుతున్నారు. గద్వాలలో  బీసీ నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఫామ్ హౌస్ లో మంతనాలు..

కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లు రవి, జడ్పీ చైర్ పర్సన్  భర్త తిరుపతయ్య మధ్య షాద్​నగర్​లోని ఫామ్ హౌస్ లో మంతనాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మల్లు రవికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఇద్దరి మధ్య మీడియేటర్ గా వ్యవహరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉండడంతో కాంగ్రెస్  పార్టీ కూడా వేగంగా పావులు కదుపుతోంది. గద్వాలలో బిగ్  వికెట్ పై కన్నేసిన కాంగ్రెస్  నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయి లీడర్లు వారితో మంతనాలు జరిపి, సరైన ప్రాతినిధ్యం ఉంటుందని హామీ ఇస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే పార్టీలో ఎప్పుడు చేరతారనే విషయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.