డ్రగ్స్‌‌ పార్టీ ఇచ్చి దొరికిపోయిండు

డ్రగ్స్‌‌ పార్టీ ఇచ్చి దొరికిపోయిండు
  •     మంజీరా గ్రూప్ ఆఫ్​ కంపెనీస్ డైరెక్టర్ వివేకానంద అరెస్టు
  •     అతని ఇద్దరు ఫ్రెండ్స్ కూడా పోలీసుల అదుపులోకి
  •     రాడిసన్ హోటల్‌‌లో డ్రగ్స్ పార్టీ 
  •     ఆదివారం అర్ధరాత్రి ఎస్‌‌ఓటీ పోలీసుల  సోదాలు
  •     పరారీలో మరో ఏడుగురు, 3 గ్రాముల కొకైన్  సీజ్

హైదరాబాద్‌‌, వెలుగు:  ప్రముఖ రాజకీయ నేత కుమారుడు, మంజీరా గ్రూప్‌‌  ఆఫ్  కంపెనీస్‌‌  డైరెక్టర్‌‌‌‌ గజ్జల వివేకానంద డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. హైదరాబాద్  గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌‌లోతన  ఫ్రెండ్స్‌‌తో డ్రగ్స్‌‌ పార్టీ చేసుకుంటూ పోలీసులకు దొరికిపోయాడు. అతనితో పాటు పార్టీలో పాల్గొన్న అతని ఫ్రెండ్స్ నిర్భయ్‌‌, కేదార్‌‌ను సైబరాబాద్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులు సహా మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్  సప్లయ్‌‌  చేసిన సయ్యద్‌‌  అబ్బాస్‌‌ అలీ జాఫ్రీ పరారీలో ఉన్నాడు. 

సైబరాబాద్  సీపీ అవినాష్‌‌  మహంతి తెలిపిన వివరాల ప్రకారం... గచ్చిబౌలిలోని రాడిసన్‌‌ హోటల్‌‌లో ఆదివారం డ్రగ్స్  పార్టీ జరుగుతున్నట్లు సైబరాబాద్‌‌‌‌  ఎస్‌‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ హోటల్‌‌పై పోలీసులు నిఘా పెట్టారు. అర్ధరాత్రి దాటిన తరువాత సోదాలు ప్రారంభించారు. హోటల్‌‌లోని అనుమానాస్పద గదుల్లో తనిఖీలు చేశారు. పోలీసులు సెర్చ్  చేస్తున్నారనే సమాచారం అందడంతో వివేకానంద సహా పార్టీలో పాల్గొన్న వారంతా అక్కడి నుంచి పారిపోయారు. రెండు రూమ్స్‌‌లో  డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ జరిగిన రూమ్‌‌లో 3 గ్రాముల కొకైన్‌‌  పేపర్  రోల్స్, కొకైన్  సాంపిల్స్‌‌, 3 సెల్‌‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

వివేకానంద గతంలో కూడా  ఇలాంటి డ్రగ్స్ పార్టీలు నిర్వహించాడని పోలీసులు గుర్తించారు. సోదాలు నిర్వహించిన తర్వాత హోటల్ స్టాఫ్‌‌ను పోలీసులు ప్రశ్నించారు. డ్రగ్స్ పార్టీ జరిగిన గదుల వద్ద సీసీటీవీ ఫుటేజేల ఆధారంగా దర్యాప్తు చేశారు. పార్టీలో ఇద్దరు యువతులు సహా మొత్తం10 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. పార్టీని వివేకానంద నిర్వహించినట్లు ఆధారాలు సేకరించారు. జూబ్లీహిల్స్‌‌లోని వివేకానంద నివాసానికి వెళ్లారు. రాజకీయ నేత కుమారుడు కావడంతో మొదట్లో పోలీసుల‌‌కు సహకరించలేదు. కుటుంబ సభ్యులకు నచ్చజెప్పిన తరువాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గచ్చిబౌలి పీఎస్‌‌కి తరలించారు. డ్రగ్స్ టెస్ట్‌‌  కిట్ల ద్వారా అతనిని పరీక్షించారు. డ్రగ్స్‌‌ తీసుకున్నట్లు గుర్తించారు. సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు.

నిందితులెవ్వరినీ వదలం

వివేకానంద తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న నిర్భయ్‌‌, కేదార్‌‌‌‌ను సోమవారం అరెస్టు చేశారు. వారికి కూడా డ్రగ్స్  టెస్ట్‌‌లు చేయడంతో కొకైన్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ఆ ఇద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచారు. వారితో పాటు  లిషి, శ్వేత్‌‌, క్రిష్‌‌, నీల్‌‌, రఘుచరణ్‌‌, సందీప్‌‌లు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. వారంతా వివేకానంద కంపెనీలో పార్ట్‌‌నర్స్‌‌, ఫ్రెండ్స్‌‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. మంజీరా గ్రూప్  ఆఫ్  కంపెనీస్ లో పనిచేస్తున్న సయ్యద్  అబ్బాస్‌‌  డ్రగ్స్ సప్లయ్  చేస్తున్నట్లు గుర్తించారు. అబ్బాస్‌‌తో పాటు డ్రగ్స్ తీసుకున్న వారందరినీ అరెస్టు చేస్తామని సీపీ అవినాష్  మహంతి తెలిపారు.