
హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం (మే 6, 2025) తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గాలి జనార్దన్ రెడ్డితో సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలోని గంగావతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఓబులాపురం మైనింగ్ కేసులో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ అనే పొలిటికల్ పార్టీని స్థాపించి 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరిపోయారు. అయితే.. సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పును ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం కూడా ఉంది.
ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే కొంత కాలం జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. అదే చంచల్గూడ జైలుకు మరోసారి గాలి జనార్దన్ రెడ్డిని తరలించనున్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో విచారణ దాదాపు 13 ఏళ్లకు పైగానే సాగింది. 3,,400 డాక్యమెంట్లను పరిశీలించి, 219 మంది సాక్ష్యులను విచారించి.. కర్ణాటక ఫారెస్ట్ ల్యాండ్స్లో గాలి బ్రదర్స్ మైనింగ్ తవ్వకాల వల్ల 884.13 కోట్ల రూపాయలను రాష్ట్రం నష్టపోయిందనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి సీబీఐ కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించడం గమనార్హం.