
హైదరాబాద్: ఓబులాపురం గనుల మైనింగ్ కేసులో అరెస్టైన కర్నాటక మాజీ మంత్రి, బళ్లారి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. చంచల్ గూడ జైల్లో స్పెషల్ క్యాటగిరి కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. శిక్ష పడ్డ నేరస్థులకు స్పెషల్ క్యాటగిరి రిలీఫ్ ఉండదని ఈ సందర్భంగా సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
కాగా, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సంచలనం సృష్టించిన ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురిని ఇటీవల సీబీఐ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. నలుగురికీ ఏడేండ్ల జైలుశిక్షతోపాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది.
ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అప్పటి ఐఏఎస్ కృపానందరెడ్డిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) ఓనర్ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పర్సనల్ అసిస్టెంట్ మెహ్ఫాజ్ అలీ ఖాన్, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాస్ రెడ్డి, అప్పటి మైనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ గతంలోనే బెయిల్పై విడుదలయ్యారు.
వీరిని దోషులుగా తేల్చిన కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పోలీసులు వీరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే చంచల్ గూడ జైల్లో తనకు A క్లాస్ వసతులు కల్పించాలని జనార్ధన్ రెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.