Gautam Gambhir: భారత క్రికెట్ ముఖ్యం, నేను కాదు.. సౌతాఫ్రికాతో ఘోర ఓటమి తర్వాత గంభీర్ కామెంట్స్

Gautam Gambhir: భారత క్రికెట్ ముఖ్యం, నేను కాదు.. సౌతాఫ్రికాతో ఘోర ఓటమి తర్వాత గంభీర్ కామెంట్స్

గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై ఓటమే కాదు సిరీస్ కూడా కోల్పోయారు. అంతేకాదు భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద ఓటమిని మూటకట్టుకుంది. ఈ పరాజయంతో టీమిండియా టెస్ట్ భవిష్యత్ డైలమాలో పడింది. విదేశాల్లో ఓటములు పక్కన పెడితే స్వదేశంలో ఘోరంగా ఓడిపోవడం తీవ్ర  ఆందోళనకు గురి చేస్తోంది. రెండో టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ స్పందించాడు. భారత క్రికెట్ కంటే తన పదవి  ముఖ్యం కాదని విచారకర కామెంట్స్ చేశాడు. 

ఓటమిపై గంభీర్ మాట్లాడుతూ ఇలా అన్నాడు " భారత క్రికెట్ ముఖ్యం. నేను కాదు. నా భవిష్యత్ ఏంటో బీసీసీఐ నిర్ణయిస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. భారత క్రికెట్ కంటే ఏదీ ముఖ్యం కాదని. ప్రస్తుతం జట్టు నేర్చుకున్న దశలో ఉంది. నేను  ఇంగ్లాండ్‌లో మంచి ఫలితాలు సాధించాను. నేను కోచ్ గా ఉన్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌ను ఇండియా గెలుచుకుంది. ఓటమికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి. విమర్శలు ఏవైనా ముందు నా నుంచే మొదలవ్వాలి. ఓడిపోతే పారిపోయే వ్యక్తిని కాను". అని రెండో టెస్ట్ ఓటమి తర్వాత మీడియాతో గంభీర్ చెప్పుకొచ్చాడు. 

ALSO READ :  CSK ప్లేయర్ ఊచకోత.. మినీ ఆక్షన్‌కు ముందు 31 బంతుల్లోనే సెంచరీ

టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగుపెట్టినప్పటి దగ్గర నుంచి భారత జట్టు టెస్టుల్లో విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. వైట్ బాల్ ఫార్మాట్ లో అదరగొట్టిన టెస్టుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో ఓటమి తర్వాత గంభీర్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇప్పటివరకు గంభీర్ కోచ్ గా భారత జట్టు ఆరు టెస్ట్ సిరీస్ లు ఆడింది. వీటిలో రెండు గెలిచి మూడు ఓడిపోయింది. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ సమమైంది. గెలిచిన రెండు సిరీస్ లు కూడా బలహీనమైన బంగ్లాదేశ్, వెస్టిండీస్ లపై కావడంతో గంభీర్ హెడ్ కోచ్ గా ఇప్పటివరకు విఫలమయ్యాడనే చెప్పాలి.

తొలి ఇన్నింగ్స్ లో ముత్తుస్వామి సెంచరీతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 489 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత మార్కో జాన్సెన్ 6 వికెట్లతో విజృంభించడంతో ఇండియా 201 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌‌‌‌ను 78.3 ఓవర్లలో 260/5 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌ చేసింది. ట్రిస్టాన్‌‌‌‌ స్టబ్స్‌‌‌‌ (94) సెంచరీ మిస్‌‌‌‌ చేసుకోగా, టోనీ డి జోర్జి (49) రాణించాడు. 549 పరుగుల టార్గెట్ లో ఇండియా కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది.