
వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాండీవధారి అర్జున’. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్మాత దిల్ రాజు, దర్శకులు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘చాలా మంది నన్ను కమర్షియల్ సినిమాలు చేయమని చెప్పేవారు. కానీ నాకు కొత్త కథలు చేయడమే ఇష్టం. సినిమా హిట్టైనా ఫ్లాప్ అయినా నా ప్రయత్నం ఆగదు.
సోషల్ మెసేజ్ ఉన్న కథలు అరుదుగా వస్తాయి. ఈ చిత్రం కూడా అలాంటిదే. ఎప్పుడూ మన కుటుంబం గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు సమాజం గురించి కూడా ఆలోచిస్తాం. అందరికీ అవగాహన కల్పించాలనే ఈ చిత్రాన్ని తీశాం. మంచి సినిమా తీశామనే ఫీలింగ్ వచ్చింది’ అన్నాడు. ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల మీద వచ్చిన ఈ స్క్రిప్ట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది అంది సాక్షి వైద్య. ‘గ్లోబల్ ఇష్యూ మీద ఈ సినిమాను తెరకెక్కించాను. ఎమోషన్‌ను జోడించి ఎంటర్‌టైనింగ్‌గా యాక్షన్ జానర్‌లో తీశాను’ అని చెప్పాడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమాను ప్రేక్షకులు హిట్ చేస్తారనే నమ్మకం ఉంది అని బీవీఎస్ఎన్ ప్రసాద్ చెప్పారు.