కరోనా పాజిటివ్ గర్భిణీకి డెలీవరీపై 2 నెలలు స్టడీ చేశాం

కరోనా పాజిటివ్ గర్భిణీకి డెలీవరీపై 2 నెలలు స్టడీ చేశాం

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా పాజిటివ్‌‌ వచ్చిన గర్భిణికి డెలివరీ చేయడం తమ అదృష్టమని గాంధీ హాస్పిటల్‌‌ గైనకాలజీ హెచ్‌‌వోడీ డాక్టర్‌‌ మహాలక్ష్మి అన్నారు. కరోనా పాజిటివ్‌‌ మహిళలకు డెలివరీ చేయాల్సి వస్తే ఎలా వ్యవహరించాలి? అనే విషయంపై రెండు నెలలు స్టడీ చేశామని వారు తెలిపారు. కరోనాకు ఎక్కడెక్కడ ఎలా ట్రీట్‌‌మెంట్‌‌ చేస్తున్నారు? వారిలో ప్రెగ్నెంట్స్‌‌ ఉంటే ఎలా ట్రీట్ చేస్తున్నారు? వాటిపై ఎలాంటి స్టడీస్‌‌ వచ్చాయి? అన్నవి కూడా పరిశీలించామన్నారు. కరోనా పాజిటివ్‌‌ మహిళకు డెలివరీ చేసిన బృందంలోని డాక్టర్లు శనివారం ‘వీ6 వెలుగు’తో మాట్లాడారు. శుక్రవారం తాము డెలివరీ చేసిన గర్భిణి కుటుంబంలో పలువురు కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో ఉన్నారని, ఆమె అత్త వైరస్ వల్ల చనిపోయారని తెలిపారు. ఆ మహిళకు 9 నెలలు నిండటంతో డెలివరీ కోసం గురువారం గాంధీకి షిఫ్ట్‌‌ చేశారని, డెలివరీపై పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాకే సిజేరియన్‌‌ చేశామని వివరించారు.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నం.. 

‘‘డెలివరీ, సిజేరియన్‌‌ నార్మల్‌‌ ప్రాసెస్‌‌లోనే చేశాం. ఆమె పాజిటివ్‌‌ పేషంట్‌‌ కావడంతో ఆమె నుంచి సర్జన్స్‌‌, అనస్థీషియన్‌‌, ఇతర టీమ్‌‌కు వైరస్‌‌ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పీపీఈలు వేసుకొని సిజేరియన్‌‌ చేశాం” అని డాక్టర్లు వివరించారు. డెలివరీకి ముందే ఆమెకు హిమోగ్లోబిన్‌‌ టెస్ట్‌‌ చేశామని, డెలివరీ టైంలో బ్లీడింగ్‌‌ ఎక్కువైతే రక్తం ఎక్కించడానికి అన్ని రెడీ చేసుకున్నామని చెప్పారు. పుట్టిన బిడ్డకు నెగిటివ్‌‌ వచ్చిందని, తల్లికి పాజిటివ్‌‌ ఉండటంతో ముందు జాగ్రత్తగా బిడ్డను ఎన్‌‌ఐసీయూలో ఉంచామన్నారు.