భారీ నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్లు.. బేర్స్ పంజాకు కారణాలు ఇవే..

భారీ నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్లు.. బేర్స్ పంజాకు కారణాలు ఇవే..

మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. నేడు అమ్మకాల ఒత్తిడికి నిఫ్టీ తలొగ్గగా.. సెన్సెక్స్ 376.27 పాయింట్లుకోల్పోయి 85,063 వద్ద స్థిరపడింది. ప్రధానంగా దిగ్గజ కంపెనీల షేర్లలో ప్రాఫిట్ బుక్కింగ్, విదేశీ పెట్టుబడులు తరలిపోవటం మార్కెట్ పతనానికి దారితీశాయి.

టాప్ లూజర్స్ - గెయినర్స్: 
టాటా గ్రూప్ సంస్థ ట్రెంట్ షేరు ఏకంగా 8 శాతం కుప్పకూలింది. ఇదే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ కూడా నష్టాల్లో ముగిశాయి. అయితే హిందాల్కో, అపోలో హాస్పిటల్స్ వంటి షేర్లు 4 శాతం వరకు లాభపడి మార్కెట్‌కు స్వల్ప మద్దతునిచ్చాయి.

ALSO READ : AI కారణంగా 2026లో కనిపించకుండా పోనున్న జాబ్స్ లిస్ట్ ఇదే..

మార్కెట్ నష్టపోవడానికి 5 ప్రధాన కారణాలు..

1. హెవీవెయిట్ షేర్లలో లాభాల స్వీకరణ:
 మార్కెట్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నేడు 2 శాతం పడిపోయాయి. గత రెండు రోజుల్లో ఈ షేరు ఏకంగా 4 శాతం నష్టపోయింది. బ్యాంక్ తాజా త్రైమాసిక నివేదికలో డిపాజిట్ల వృద్ధి తగ్గినట్లు పేర్కొనటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది.

2. ట్రంప్ సుంకాల హెచ్చరిక: 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లు పెంచుతామని చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌ను భయపెట్టాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించాలన్న అమెరికా డిమాండ్‌ను భారత్ పాటించకపోతే.. వాణిజ్యపరమైన ఆంక్షలు తప్పవనే సంకేతాలు వెలువడటంతో సెంటిమెంట్ దెబ్బతింది.

ALSO READ : క్రిప్టోలో ట్రేడింగ్ వద్దు SIP ముద్దు..

3. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు: 
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సోమవారం రూ. 36.25 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. విదేశీ నిధులు నిరంతరం బయటకు వెళ్లడం మార్కెట్ లిక్విడిటీపై ఇవాళ ఒత్తిడిని పెంచింది.

4. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: 
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ కావడంతో అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపడంతో పాటు భారత మార్కెట్లను కూడా అప్రమత్తం చేసింది.

5. పెరిగిన భయం: 
మార్కెట్ వోలటాలిటీ ఇండెక్స్(India VIX) 2 శాతం పెరిగింది. గత మూడు రోజుల్లో ఇది 10 శాతానికి పైగా పెరగడం అనేది మార్కెట్లో భవిష్యత్ ఒడిదుడుకులకు సంకేతం.

ప్రస్తుతానికి నిఫ్టీ 26,100–26,150 వద్ద సపోర్ట్ కలిగి ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని.. క్వాలిటీ షేర్లను మాత్రమే ఎంచుకోవాలని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణుడు డాక్టర్ వి.కె. విజయకుమార్ సూచించారు.