అడిలైడ్: ఇండియా విమెన్స్ జట్టు.. ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్‌లో పదేండ్లుగా అందని ద్రాక్షగా మారిన సిరీస్‌ను ఎట్టకేలకు సొంతం చేసుకుంది. స్మృతి మంధాన (55 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82), జెమీమా రోడ్రిగ్స్ (46 బాల్స్‌లో 4 ఫోర్లతో 59) సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌తో చెలరేగడంతో.. శనివారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో టీమిండియా 17 రన్స్ తేడాతో ఆసీస్‌పై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. 2016 తర్వాత ఆసీస్ గడ్డపై ఇండియాకు ఇది తొలి టీ20 సిరీస్ విజయం కావడం విశేషం. అలాగే వరుసగా 7 సిరీస్ లు గెలిచిన ఆసీస్ జైత్రయాత్రకు బ్రేక్ చేసింది.
టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. మూడో ఓవర్‌లోనే షెఫాలీ (7) వెనుదిరిగినా.. స్మృతి, జెమీమా ఆసీస్ బౌలింగ్‌ను ఉతికేశారు. భారీ హిట్టింగ్‌తో బౌండ్రీలు రాబట్టారు. ఈ క్రమంలో స్మృతి 38 బాల్స్‌లో హాఫ్ సెంచరీ సాధించింది. రెండో వికెట్‌కు 121 రన్స్ జోడించి స్మృతి ఔటైంది. ఈ దశలో వచ్చిన రిచా ఘోష్ (18) ఉన్నంతసేపు వేగంగా ఆడింది. . హర్మన్‌ప్రీత్ (2 నాటౌట్)కు చాన్స్ ఇవ్వకుండానే.. ఆఖరి ఓవర్‌లో నాలుగు బాల్స్ తేడాలో జెమీమా, అమన్‌జోత్ కౌర్ (1), దీప్తి శర్మ (1) ఔటయ్యారు. సదర్లాండ్ 2 వికెట్లు తీసింది.
ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 159/9 స్కోరు చేసి ఓడించింది. ఆష్లే గార్డ్‌నర్ (57) టాప్ స్కోరర్. శ్రేయాంక పాటిల్ (3/22), శ్రీచరణి (3/32), అరుంధతి రెడ్డి (2/35) దెబ్బకు కంగారూల లైనప్ కుప్పకూలింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (26), సదర్లాండ్ (14), జార్జియా వారెహామ్ (12), జార్జియా వోల్ (10) పోరాడి విఫలమయ్యారు. స్మృతి మంధానాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం నుంచి ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలవుతుంది.
