Vijay Hazare Trophy 2025-26: కంబ్యాక్ లో అదరగొట్టిన అయ్యర్, సిరాజ్.. గిల్, జైశ్వాల్, రాహుల్ ఫ్లాప్

Vijay Hazare Trophy 2025-26: కంబ్యాక్ లో అదరగొట్టిన అయ్యర్, సిరాజ్.. గిల్, జైశ్వాల్, రాహుల్ ఫ్లాప్

న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు ముందు టీమిండియా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. డొమెస్టిక్ క్రికెట్ లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో మ్యాచ్ లు ఆడుతూ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మినహాయిస్తే దాదాపు అందరూ టీమిండియా క్రికెటర్లు మంగళవారం (జనవరి 6) విజయ్ హజారే ట్రోఫీలో మ్యాచ్ ఆడారు. గాయం నుంచి కోలుకున్న శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ తో పాటు జైశ్వాల్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ ఆడారు. వీరిలో ఎవరు విఫలమయ్యారో.. ఎవరు బాగా ఆడారో ఇప్పుడు చూద్దాం.. 

శ్రేయాస్ అయ్యర్:

రీ ఎంట్రీ లో ముంబై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించాడు. హిమాచల్ ప్రదేశ్ పై 82 పరుగులు చేసి అదరగొట్టాడు. ముంబై టాప్ స్కోరర్ అయ్యర్ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తో న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు అయ్యర్ ఫామ్, ఫిట్ నెస్ పై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. 

శుభమాన్ గిల్:

టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ఇంకా గాడిలో పడలేదు. పేలవ ఫామ్ కారణంగా టీ20 జట్టులో స్థానం కోల్పోయిన గిల్.. గాయం తర్వాత కోలుకొని ఆడిన తొలి మ్యాచ్ లో 11 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు దూరమైన గిల్.. న్యూజిలాండ్ తో జరగబోయే సిరీస్ లో టీమిండియా వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 

Also Read :  ఇండియాలో మీకేం జరగదు.. మాది హామీ

కేఎల్ రాహుల్:

వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విజయ్ హజారే ట్రోఫీలో విఫలమయ్యాడు. రాజస్థాన్ పై కేవలం 25 పరుగులే చేసి ఔటయ్యాడు. రాహుల్ భారత వన్డే జట్టులో ప్రధాన వికెట్ కీపర్. ప్లేయింగ్ 11 లో ఖచ్చితంగా అంటాడు. కేఎల్ ప్రస్తుతం వన్డే, టెస్ట్ ఫార్మాట్ లో ఆడుతున్నాడు. టీ20ల్లో ఈ వెటరన్ ప్లేయర్ కు ఛాన్స్ దక్కడం లేదు. 

యశస్వి జైశ్వాల్:

విజయ్ హజారే ట్రోఫీలో జైశ్వాల్ నిరాశపరిచాడు. హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 15 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. టీమిండియా బ్యాకప్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గత నెలలో సౌతాఫ్రికాపై జరిగిన చివరి వన్డేలో సెంచరీతో సత్తా చాటిన సంగతి తెలిసందే. దీంతో కివీస్ తో జరగబోయే సిరీస్ లో బ్యాకప్ ఓపెనర్ గా స్థానం సంపాదించుకున్నాడు.                    
     
మహమ్మద్ సిరాజ్:

చాలా నెలల తర్వాత భారత వన్డే జట్టులో స్థానం సంపాదించిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్.. న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు ఫామ్ లోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టి రాణించాడు. కివీస్ తో జనవరి 11 నుంచి జరగబోయే వన్డే సిరీస్ లో సిరాజ్ ప్లేయింగ్ 11 లో ఉండడం దాదాపు ఖాయమైంది.