- గాంధీలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్
- 22 ఏండ్ల యువకుడికి చేసిన డాక్టర్లు
- ఇప్పటివరకు హాస్పిటల్లో 30 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ పూర్తి
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ డాక్టర్లు మరోసారి ప్రతిభ చాటుకున్నారు. 22 ఏండ్ల యువకుడికి సక్సెస్‌ఫుల్‌గా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. అడ్డగుట్టకు చెందిన 22 ఏండ్ల పి. సాయి మోహన్ గత 8 నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. పలు ప్రైవేటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా ఫలితం లేకపోయింది.
పరిస్థితి విషమించి డయాలసిస్‌పై ఆధారపడాల్సి రావడంతో చివరకు గాంధీ హాస్పిటల్‌ను ఆశ్రయించాడు. దీంతో డాక్టర్లు అతడికి పరీక్షలు నిర్వహించి కిడ్నీ మార్పిడి అవసరమని గుర్తించారు. సాయి తండ్రి నరసింహారావు కిడ్నీ దానం చేయడానికి ముందుకు రావడంతో ఆరోగ్యశ్రీ పథకం కింద మార్చి 17న శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
ప్రస్తుతం సాయి మోహన్ డయాలసిస్ అవసరం లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతుండగా, కిడ్నీ దానం చేసిన తండ్రి నరసింహారావు కూడా క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ఈ శస్త్రచికిత్సను నెఫ్రాలజీ డాక్టర్లు డా. శ్రీకాంత్, డా. మంజూష, డా. శ్రీనివాస్ బృందం, యూరాలజీ విభాగం డా. రవిచంద్ర, డా. వినయ్ బృందాలు సమన్వయంతో పూర్తి చేయగా, అనస్థీషియా విభాగం నుంచి డా. మురళీధర్, డా. చంద్రావతి బృందం సహకారం అందించింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సూపరింటెండెంట్ డా. సునీల్ మాట్లాడుతూ.. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటివరకు మొత్తం 30 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేశామని, ఇలాంటి లైవ్ ట్రాన్స్‌ప్లాంట్స్ అరుదుగా జరుగుతాయన్నారు.
