10 మంది నిపుణులతో గాంధీలో కొవిడ్​ కమిటీ .. మొత్తం 60 బెడ్లతో మూడు కరోనా వార్డులు ఏర్పాటు

10 మంది నిపుణులతో గాంధీలో కొవిడ్​ కమిటీ .. మొత్తం 60 బెడ్లతో మూడు కరోనా వార్డులు ఏర్పాటు

పద్మారావునగర్, వెలుగు: సిటీలో కొవిడ్ కేసు నమోదైన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. సూపరింటెండెంట్ డా.రాజకుమారి చైర్మన్ గా ఆయా వైద్య విభాగాలకు చెందిన 10 మంది నిపుణులతో ప్రత్యేక కొవిడ్ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 60 బెడ్లతో 3 కొవిడ్ వార్డులు సిద్ధం చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ డా.కె.సునీల్ తెలిపారు. ఇందులో అత్యవసర వైద్య వసతులు కలిగిన 15 బెడ్లతోస్పెషల్ వార్డు ను ఎమర్జెన్సీ విభాగం వెనక ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్​లక్షణాలతో వచ్చే పేషెంట్లకు ఆర్టీపీసీఆర్​టెస్టులు నిర్వహిస్తామన్నారు. 

కేసులు పెరిగినట్లయితే వైరస్​వేరియంట్​ఏంటో తెలుసుకోవడానికి జీనోమ్​స్వీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ ను వైరాలజీ ల్యాబ్​కు  పంపిస్తామన్నారు. కాగా కొవిడ్ కమిటీలో చైర్మన్ గా సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, నోడల్ ఆఫీసర్ గా జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ఎల్.సునీల్ కుమార్ వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె.సునీల్, ఆర్ఎంఓ1 డాక్టర్ శేషాద్రి, ఫల్మనాలజీ హెచ్ఓడీ డాక్టర్ కృష్ణమూర్తి, అనస్తీషియా హెచ్ఓడీ ఆవుల మురళీధర్, పీడియాట్రిక్ హెచ్ఓడీ డాక్టర్ వాసుదేవ్, గైనకాలజీ హెచ్ఓడీ డాక్టర్ రాధ, మైక్రో బయాలజీ హెచ్ఓడీ డాక్టర్ పూజ, డ్యూటీ ఆర్ఎంఓతో పాటు  పీజీ వైద్యులు ఉంటారు. కొవిడ్​కేసులు పెరిగితే పేషెంట్లకు అందించే అత్యవసర వైద్యం, వసతులపై కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని డాక్టర్ కె.సునీల్ తెలిపారు. గాంధీలో వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ వార్డులు సిద్ధంగా ఉన్నాయన్నారు.

కరోనా కేసులన్నీ ఎల్ఎఫ్7, ఎక్స్ఎఫ్​జీ వేరియంట్లే

దేశంలో నమోదవుతున్న కొవిడ్​కేసుల్లో 73 శాతం ఎల్ఎఫ్7, ఎక్స్​ఎఫ్ జీ వేరియంట్లవేనని ఐఎన్ఎస్​ఏసీఓజీ(ఇండియన్​సార్స్​కొవిడ్2 జెనోమిక్స్​కన్సార్టియం) సంస్థ శనివారం వెల్లడించినట్లు గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్​మెడిసన్​ప్రొఫెసర్​డా.కిరణ్​మాదాల తెలిపారు. శనివారం రాత్రి ఆయన వెలుగుతో మాట్లాడారు. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో మే నెలలో నమోదైన కేసుల్లో ఈ రెండు వేరియంట్లు వెలుగు చూశాయన్నారు. కాగా ఏప్రిల్​లో నమోదైన ఓ కేసులో ఎన్​బీ 1.8.1 వేరియంట్ బయటపడిందన్నారు. ఇది అంత తీవ్రమైనది కాదన్నారు. 2019 డిసెంబర్​లో కనిపించినప్పటి నుంచి పూర్తిగా కనుమరుగుకాలేదన్నారు.

2022లో ఒమిక్రాన్​ వేరియంట్​వచ్చిన తర్వాత దీని తీవ్రత గణనీయంగా తగ్గిందన్నారు. ఆ తర్వాత నుంచి జేఎన్ 1, ఎక్స్​బీబీ వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఏడుకు పైగా వేరియంట్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయన్నారు. ఇప్పుడు కరోనా అనేది సాధారణ శ్వాసకోశ వైరస్​ల జాబితాలోకి చేరిందన్నారు. ఇదే విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్​ధ్రువీకరించాయన్నారు. కొత్త వేరియంట్లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా నిబంధనలు పాటిస్తే సరిపోతుందని డాక్టర్​కిరణ్​ తెలిపారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే సెల్ఫ్​ ఐసోలేషన్​ లో ఉండాలని, డాక్టర్​ను సంప్రదించి, ట్రీట్మెంట్ పొందాలన్నారు.