- రోడ్డు ప్రమాదాల నియంత్రణపై పోలీసుల ఫోకస్
- నేషనల్, స్టేట్ హైవేలపై విలేజ్రోడ్సేఫ్టీ కమిటీలు
- ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన
- జిల్లాలో 39 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
- ఈ ఏడాది ఇప్పటివరకు 119 మంది మృతి, 376 మందికి గాయాలు
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న యాక్సిడెంట్లను కంట్రోల్ చేయడంపై పోలీసు డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టింది. ‘రహదారి భద్రత.. మనందరి బాధ్యత’ అనే నినాదంతో రోడ్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, ప్రమాదాల నియంత్రణలో పౌరులను భాగస్వామ్యం చేస్తోంది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలపై గ్రామ రహదారి భద్రత (విలేజ్ రోడ్‌సేఫ్టీ) కమిటీలను డీసీపీ ఎగ్గడి భాస్కర్ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని పెద్ద మనుషులు, సోషల్ వర్కర్లు, ఔత్సాహిక యువకులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు.
వీరంతా గ్రామస్తులతో తరచూ సమావేశాలు నిర్వహించి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తారు. ఓవర్ స్పీడ్, రాంగ్‌రూట్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతున్న వారిపై దృష్టి పెడుతారు. రైతులు రోడ్లపై పశువులను వదిలేకుండా చర్యలు తీసుకుంటారు. తద్వారా యాక్సిడెంట్లు గణనీయంగా తగ్గించవచ్చని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా పోలీసు కళాబృందాలతో రోడ్డు భద్రతా నియమాలను పాటల ద్వారా తెలుపుతూ ప్రజల్లో చైతన్యం నింపేలా కళాజాత ప్రదర్శనలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు జరిగిన యాక్సిడెంట్ల తీవ్రత, కారణాలను వివరిస్తూ రోడ్లపైకి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
జిల్లాలో 39 బ్లాక్ స్పాట్స్
జిల్లావ్యాప్తంగా యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్న 39 ఏరియాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నేషనల్ హైవే 63 జిల్లాలో గూడెం గోదావరి బ్రిడ్జి నుంచి కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వరకు 91 కిలోమీటర్లు ఉంది. దీనిపై వివిధ ప్రాంతాల్లో 20 బ్లాక్స్పాట్స్ఉన్నాయి.
ఎన్‌హెచ్363 శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్నుంచి తాండూర్ మండలం రేపల్లెవాడ వరకు 42 కిలోమీటర్లు ఉండగా.. దీనిపై 6 బ్లాక్ స్పాట్స్, స్టేట్‌హైవే 1 (రాజీవ్ రహదారి) గోదావరిఖని బ్రిడ్జి నుంచి ఇందారం క్రాస్‌వరకు 2 బ్లాక్‌స్పాట్స్, స్టేట్‌హైవే 24 జన్నారం మండలం ఇందన్పల్లి నుంచి లక్సెట్టిపేట శివారులోని కరీంనగర్ చౌరస్తా వరకు 47 కిలోమీటర్ల పరిధిలో 3, పాటు ఇతర ప్రాంతాల్లో మరో నాలుగింటిని గుర్తించారు.
ఇవి డేంజరస్ స్పాట్స్..
మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జిపై 2022 నుంచి 2024 వరకు 26 యాక్సిడెంట్లు జరిగితే 10 మంది చనిపోయారు. 30 ఏండ్ల క్రితం నిర్మించి ఈ ఆర్వోబీ ఇరుకుగా ఉండి ప్రస్తుత ట్రాఫిక్‌కు సరిపోవడం లేదు. బ్రిడ్జి దిగేటప్పుడు వాహనాలు స్పీడ్ కంట్రోల్కాకపోవడం, ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అలాగే లక్ష్మి టాకీస్చౌరస్తాలో ఇప్పటివరకు 10 ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. తోళ్లవాగు–నస్పూర్ గేట్మధ్య 25 యాక్సిడెంట్లు జరిగాయి.
ఈ ఘటనల్లో మరో 10 మంది మరణించారు. గద్దెరాగడిలో 16 యాక్సిడెంట్లలో 9 మంది, బొక్కలగుట్ట వద్ద 18 యాక్సిడెంట్లలో 8 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. లక్సెట్టిపేట శివారు కరీంనగర్ చౌరస్తాలో 9 ప్రమాదాల్లో ఆరుగురు చనిపోగా, లక్సెట్టిపేట టౌన్‌లోని ఆంధ్రా బోర్ వద్ద 8 ఘటనల్లో ఏడుగురు చనిపోయారు. లక్సెట్టిపేట మండలం గుల్లకోట వద్ద 8 యాక్సిడెంట్లలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ముల్కల్ల పరిధిలో ఈ సంవత్సరం ఏకంగా ఐదుగురు
విగత జీవులయ్యారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
జిల్లాలో రోడ్ యాక్సిడెంట్లను కంట్రోల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రజల్లో రహదారి భద్రతా నియమాలపై అవగాహన అవసరం. రహదారి భద్రత.. మనందరి బాధ్యత నినాదంతో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. రోడ్డుపైకి వచ్చినవారు సురక్షితంగా గమ్యం చేరుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.
ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం లాంటి కారణాలతో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్లపై పశువులను వదిలినా, మైనర్లకు వాహనాలు ఇచ్చినా చర్యలు తీసుకుంటాం. బైకర్స్ హెల్మెట్ పెట్టుకోవాలి.- ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల డీసీపీ
నాలుగేండ్లలో 1,604 యాక్సిడెంట్లు, 561 మరణాలు...
సంవత్సరం యాక్సిడెంట్లు మృతులు గాయాలు
2022 413 173 334
2023 358 122 332
2024 453 147 473
2025 380 119 376
మొత్తం 1,604 561 1,515
