బిహార్లో మొదలైన పోలింగ్.. 121 స్థానాల్లో 1,314 మంది అభ్యర్థులు.. 3.75 కోట్ల మంది ఓటర్లు

బిహార్లో మొదలైన పోలింగ్.. 121 స్థానాల్లో 1,314 మంది అభ్యర్థులు.. 3.75  కోట్ల మంది ఓటర్లు
  • తేజస్వీ, సమ్రాట్ చౌధరి సహా కీలక నేతల నియోజకవర్గాల్లో పోలింగ్​
  • 11న రెండో దశ.. 14న ఫలితాలు

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇయ్యాల తొలి దశ పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు. మొత్తంగా 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో 1,314 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 121 నియోజకవర్గాల్లోని 3.75 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. తొలిదశలో పోటీ పడుతున్న వారిలో ఆర్జేడీ అగ్రనేత, మహాఘట్ బంధన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ తో పాటు బీజేపీ సీనియర్ లీడర్, బిహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి తదితరులు ఉన్నారు. 

వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వీ యాదవ్ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మరోమారు ఇక్కడి నుంచే పోటీచేస్తున్న తేజస్వీ.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక్కడ బీజేపీ తరఫున సతీశ్ కుమార్ బరిలో ఉన్నారు. 2010లో ఇదే నియోజకవర్గంలో తేజస్వీ తల్లి రబ్రీదేవిని సతీశ్ ఓడించారు. 

కాగా, రాఘోపూర్ నుంచి తాను కూడా పోటీ చేస్తానని జన్ సురాజ్ అధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. అయితే, తర్వాత ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్న ప్రశాంత్ కిశోర్.. తన పార్టీ తరఫున చంచల్ సింగ్ ను నిలబెట్టారు. ప్రస్తుతం బరిలో ఉన్న తేజస్వీ, సతీశ్ కుమార్​ల మధ్య హోరాహోరీ పోటీ తప్పదని 
రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మహువా నుంచి తేజ్ ప్రతాప్

రాఘోపూర్ నియోజకవర్గం పక్కనే ఉన్న మహువా నియోజకవర్గం నుంచి తేజస్వీ సోదరుడు, జనశక్తి జనతా దళ్​(జేజేడీ) చీఫ్​ తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ ను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో తేజ్ ప్రతాప్ కొత్త పార్టీ పెట్టి తాను పోటీ చేయడంతో పాటు మరో 29 మందికి టికెట్ ఇచ్చి బరిలో నిలబెట్టారు. మరోవైపు, బీజేపీ సీనియర్ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి తారాపూర్ నియోజకవర్గం నుంచి, మరో ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ పడుతున్నారు. 

రెండో సారి శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్న సమ్రాట్ చౌధరి దాదాపు పదేళ్ల తర్వాత ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడుతున్నారు. గత ఎన్నికల్లో 5 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన సమ్రాట్ చౌధరికి ఆర్జేడీ నేత అరుణ్​ కుమార్ నుంచి గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. మిగతా స్థానాలకు ఈ నెల 11 న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ నెల ఎన్నికల సంఘం 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనుంది.