- బలవంతంగా తీసుకెళ్లేందుకు తండ్రి, బావ, అడ్డుకున్న స్థానికులు
- జగిత్యాల జిల్లాలో ఘటన
జగిత్యాల టౌన్/పెద్దపల్లి, వెలుగు : ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు తల్లిదండ్రులు యత్నించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేశ్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక ఆరేండ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెండ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ జూలై 2న వివాహం చేసుకున్నారు.
ప్రియాంక గర్భవతి కావడంతో బుధవారం తన అత్తతో కలిసి జగిత్యాలలోని హాస్పిటల్‌కు వచ్చింది. హాస్పిటల్‌లో చూపించుకున్న తర్వాత తిరిగి వెళ్తూ రాజారాంపల్లె వద్ద బస్సు దిగారు. బస్టాండ్‌కు వచ్చిన ప్రియాంక తల్లి ఆమె అత్తను పక్కకు తీసుకెళ్లింది. ఇదే టైంలో అక్కడకు వచ్చిన ప్రియాంక తండ్రి వెంకటేశ్, బావ కుమార్ కలిసి యువతిని బలవంతంగా తీసుకెళ్లేందుకు యత్నించారు.
దీంతో స్థానికులు అడ్డుకోగా, ప్రియాంక 100కు ఫోన్ చేయడంతో వారు అక్కడి నుంచి పరార్ అయ్యారు. అనంతరం ప్రియాంక వెల్గటూర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తల్లిదండ్రులు, బావపై ఫిర్యాదు చేసింది. తనకు, భర్త రాకేశ్‌కు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
