మహాత్ముడిగా మనకు తెలిసిన గాంధీ సామాన్యులలో సామాన్యుడు

మహాత్ముడిగా మనకు తెలిసిన గాంధీ సామాన్యులలో సామాన్యుడు

అసామాన్యుడిగా, మహాత్ముడిగా మనకు తెలిసిన గాంధీ సామాన్యులలో సామాన్యుడు. గాంధీ శ్రమజీవి. ప్రతిమనిషీ రోజూ కొంతైనా శ్రమ చేయాలనే విశ్వాసం ఆయనది. పొలంలో ఒక గుడిసె నిర్మాణం ప్రారంభించినపుడు అందరికంటే ముందు దానిపైకి ఎక్కాడు. చిన్నాపెద్దా మేకులతో నిండిన అనేక జేబులున్న నీలంరంగు ముతకబట్టలను తొడుక్కున్నాడు. ఒక జేబులోంచి ఒక సుత్తి తొంగిచూస్తోంది. ఒక చిన్న రంపం, బరమా అతని నడుం దగ్గర బెల్టుకు వేలాడుతున్నాయి. మండుటెండలోనే, కొద్దిరోజుల్లోనే గుడిసె నిర్మాణం పూర్తిచేశాడు. ఏడుగంటల పాటు నిర్విరామంగా పనిచేసి పెద్ద పుస్తకాల అలమరా తయారుచేశాడు. ఆయన చరఖాపై నూలు వడకడం, మగ్గంపై నేయడం, వంటలు చేయడం, సూది దారంతో కుట్టుపని చేయడం, పళ్ల చెట్లని, పూల మొక్కలని సాకడం, గునపంతో నేలని తవ్వడం, నూతినుంచి నీళ్లు తోడడం, బండి నుంచి బరువైన సరుకులు దించడం చేశాడు. సుదీర్ఘమైన, వేగమైన నడక ఆయన దృష్టిలో తిరుగులేని వ్యాయామం. రోజూ కొన్ని మైళ్లు చెప్పుల్లేకుండా నడిచి వెళ్ళేంత ఆరోగ్యంగా ఉండేవాడు. దక్షిణాఫ్రికా స్నేహితులు ఆయనను ‘కర్మవీరుడు’ అనేవారు.

దక్షిణాఫ్రికాలో క్షురకులు నల్లవాళ్లకు క్షౌరం చేయకపోయేవారు. గాంధీ కత్తెర, కత్తి కొనుక్కొని, అద్దంలో చూసుకుంటూ తన జుట్టు తనే కత్తిరించుకున్నాడు. గడ్డం చేసుకోవడం కుదిరింది. కానీ, జుట్టు కత్తిరించుకోవడం ఎలాగో ఒకలా పూర్తిచేసాడు. కోర్టులో ఒక స్నేహితుడు ‘‘గాంధీ! నీ జుట్టు ఏమైంది? రాత్రి ఎలుకలు కొట్టేశాయా?” అని అడిగాడు. జరిగిన సంగతి చెప్పాడు. తర్వాత తాను స్థాపించిన ఆశ్రమంలో ఆశ్రమవాసులు ఒకరి జుట్టు మరొకరు కత్తిరించేలా శిక్షణ ఇచ్చాడు. గాంధీ మొదటిసారి బట్టలు ఉతికినప్పుడు గంజి కొంచెం ఎక్కువై కొయ్యలా బిగుసుకుపోయినై. వాటిని వేసుకొని కోర్టుకు వెళ్తే స్నేహితులు నవ్వారు. “ఇది నా మొదటి ప్రయత్నం. ఇది మిమ్మల్ని నవ్వించడానికైనా పనికొచ్చింది కదా” అన్నాడు. కొద్దిరోజులకే ఆయన బట్టలు ఉతికే పనిలో నైపుణ్యం సంపాదించాడు. తన దుస్తులను తానే ఉతికి, ఇస్త్రీ చేసుకునేవాడు. తన అంగవస్త్రం, కండువా, తుండుగుడ్డలను చిన్న మరక కూడ లేకుండా శుభ్రంగా, ఒక్క అనవసరమైన మడత కూడ తేకుండా ఉంచుకునే వాడు, పరిశుభ్రతకు ఆయన ప్రతిరూపం.

మరుగుదొడ్లను శుభ్రం చేసే పనిని దక్షిణాఫ్రికాలో నేర్చుకున్నాడు గాంధీ. స్నేహితులు ఆయనను ‘గొప్ప పాకీవాడు’ అనేవారు. ఇండియాలో రాజ్ కోట్లో తండ్రి గారింట్లో మరుగుదొడ్లు శుభ్రం చేసేవాడు. ప్రతి ఇంటికీ వెళ్లి మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని గురించి తెలియజెప్పాడు. చెప్పులు కుట్టే కళను దక్షిణాఫ్రికాలో కాలెన్ బాక్ అనే జర్మన్ స్నేహితుని నుంచి నేర్చుకున్నాడు. ఆ తర్వాత గాంధీ చెప్పులు కుట్టడంలో ఇతరులకు కూడ శిక్షణ ఇచ్చాడు. ఆ నైపుణ్యంలో ఆయన గురువునే మించిపోయాడు.

గోధుమలను విసిరేవాడు. విసిరేముందు గోధుమలను శుభ్రం చేసేవాడు. వంటింట్లో కూరగాయలు తరిగేవాడు. కూరగాయలు, పళ్లు, ధాన్యాలలోని పోషక విలువల గురించి తెలుసు. ఒక ఆశ్రమవాసి బంగాళా దుంపలను కడుగకుండానే తరిగాడు. దాంతో బంగాళాదుంపలను, కూరగాయలను కొయ్యకముందు ఎందుకు కడగాలో అతనికి వివరించాడు. వంట సిద్ధం చేయడానికి గాంధీకి 20 నిమిషాలు చాలు. వంటకళను సరళీకరించాడు. ఆరోగ్యంగా ఉండేందుకు తినాలి. అంతేకానీ, నాలుకను తృప్తి పరిచేందుకు తినకూడదని నమ్మాడు.

జబ్బులను తగ్గించేందుకు నీరు, మట్టి, తాజా గాలి, సూర్యరశ్మిల సాయంతో చిక్సిత చేసే విధానం కనిపెట్టాడు. ముందు తనమీద, భార్యాపిల్లల మీద ప్రయోగాలు చేసిన తర్వాత, ఇతరులపై ప్రయోగించాడు. ఉపవాసం చేయడం, ఆహారంలో మార్పు, మూలికల వాడకం మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. చికిత్సా పద్ధతుల కన్నా నివారణా విధానాలు ఎక్కువగా అమలు చేయాలనేది ఆయన భావన. రోగులకు నర్సువలె శ్రద్ధగా సేవలు చేసేవాడు. రోగాలు అంటుకుంటాయేమోనన్న భయం ఆయనకు లేదు.

నూలు వడకటమనేది ఆయనకు ఒక పవిత్రకార్యం. తన ఆశ్రమానికి సందర్శకులు వచ్చినప్పుడు, చరఖా మీద పనిచేస్తూ, తానూ తన భార్యా తమ దుస్తులు తామే ఎలా తయారుచేసుకుంటున్నారో వివరించాడు. ఆయన చాలా పొదుపుగా ఉండేవాడు. చవకగా, నాణ్యంగా, అందంగా ఉండే వస్తువులను తేలికగా పసిగట్టేవాడు. స్వయంగా తయారుచేసుకున్న ఖాదీ వస్త్రం, ముతక దుప్పటి, నాటుతోలు చెప్పులు ధరించేవాడు. ఎప్పుడు విందుభోజనం చేసేవాడు కాదు. ఒకటి రెండు కాల్చిన రొట్టెలు, అన్నం, ఉడికించిన కూరగాయలు, పచ్చి ఆకుకూరలు, మేకపాలు, బెల్లం, తేనె, పళ్లు ఆయన ఆహారం. సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం ముగించేవాడు. సమయపాలనలో కచ్చితంగా ఉండేవాడు. ఏ కార్యక్రమానికీ ఆలస్యంగా వచ్చేవాడు కాదు. అలాగని ఏ పనీ కంగారుగా చేసేవాడు కాదు.
ఇవే కాదు - ఇంటా బయటా, స్వంత పనులలో ఉన్నప్పుడూ, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నప్పుడూ, సమావేశాలలో ఉన్నప్పుడూ, సామాన్య ప్రజలతో కలిసున్నప్పుడూ సాధారణ వ్యక్తిలా ఎలా మెలిగాడో అను బందోపాధ్యాయ రాసిన, నండూరి వెంకట సుబ్బారావు తెలుగులో అనువదించి మనకందించిన “బహురూపి గాంధీ” అనే గ్రంథం చదివితే తెలుస్తుంది, ఇది చదివిన మనం వీలైనంత వరకూ ఇతరులపై ఆధారపడకుండా మన పనులను మనమే చేసుకోవాలనుకుంటాము. మన జీవితాన్ని... మనకూ మన కుటుంబానికి సమాజానికీ మరింత ప్రయోజనాత్మకమైన రీతిలో మలచుకుంటాము.

- ఎ. గజేందర్ రెడ్డి
9848894086