నిమజ్జనానికి ఏర్పాట్లు.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్న గణనాథుడు

నిమజ్జనానికి ఏర్పాట్లు..  రేపు గంగమ్మ ఒడికి చేరనున్న గణనాథుడు
  • ట్రైసిటీ పరిధిలోనే 6 వేలకుపైగా విగ్రహాల ఏర్పాటు
  • గ్రేటర్‍ 24 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసిన ఆఫీసర్లు
  • పర్యవేక్షించిన అధికారులు, ప్రజాప్రతినిధులు

వరంగల్, వెలుగు: వినాయక నిమజ్జనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు నిమజ్జనం నిర్వహిస్తుండగా, కావాల్సిన ఏర్పాట్లపై సిటీలోని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, సీపీ, మేయర్‍, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍ ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, పనులను పర్యవేక్షించారు.

24 చోట్ల నిమజ్జన పాయింట్లు.. 

గ్రేటర్ సిటీలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధిలో ఈ ఏడాది దాదాపు 6 వేలకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించినట్లు గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు తెలిపారు. వరంగల్‍ పోలీస్ కమిషనరేట్‍ పరిధిలో అధికారుల లెక్కల ప్రకారం 6,683 మండపాలు ఉండగా, సెంట్రల్‍ జోన్‍ పరిధిలో 2,675 ఈస్ట్​ జోన్‍లో 2,043, వెస్ట్​ జోన్‍లో 1,945 విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 6,354 మండపాలను జియో ట్యాగింగ్‍ చేసినట్లు పేర్కొన్నారు.

మండపాలే కాకుండా ఆలయాలు, అపార్టుమెంట్ల పరిధిలో మరో 1200 నుంచి 1500 విగ్రహాలు ప్రతిష్టించారు. వీటి నిమజ్జనం కోసం ప్రధాన చెరువులు, సిటీ అవతల ఉండే చిన్న చెరువులతో కలిపి మొత్తంగా 24 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 24 క్రేన్లతోపాటు పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేసే వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో మరో 2 భారీ క్రేన్లు అందుబాటులో ఉంచారు. ఫ్లడ్‍ లైట్లు, బారికేడ్ల నిర్మాణం, తెప్పల ఏర్పాటు, సేవల కోసం అవసరమైన వలంటీర్లను నియమించారు.

 ప్రధానంగా హనుమకొండ పద్మాక్షి టెంపుల్ సిద్దేశ్వర గుండం, వరంగల్ చిన్న వడ్డెపల్లి చెరువు, వరంగల్ కోట చెరువు, గీసుగొండ కట్ట మల్లన్న చెరువు, కరీమాబాద్ ఉర్సు గుట్ట రంగం చెరువు, మామూనూర్​ బెస్తం చెరువు, ఖిలా వరంగల్ అగర్తల చెరువు, మామూనూర్ పెద్ద చెరువు, కాజీపేట బంధం చెరువు, చల్లా చెరువు, గోపాల్​పూర్ చెరువు, బీమారం చెరువు, హసన్​పర్తి చెరువులను ప్రధాన పాయింట్లుగా ఉన్నాయి.  

డీజేలు పెట్టొద్దు 

వరంగల్‍, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీష్‍తో పాటు మేయర్‍ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍తో కలిసి నిమజ్జనం నిర్వహించే చెరువులను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు, బందోబస్త్ విషయంలో డీసీపీలు, ఏసీపీ, సీఐలకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. యాత్రలో డీజేలు, భారీ సౌండ్ బాక్సులు పెట్టొద్దని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. దాదాపు 2 వేల మంది సిబ్బందితో నిమజ్జన విధులు నిర్వహణకు అడుగులు వేస్తున్నారు.

ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

హసన్ పర్తి : వరంగల్​ ట్రై సిటీ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వరంగల్​ సీపీ సన్​ప్రీత్​సింగ్​ వెల్లడించారు. నగరంలో పెద్ద స్థాయిలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకుగాను చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నిమజ్జనం రోజున శోభా యాత్ర వెళ్లే రోడ్లులో, నిమజ్జనం జరిగే ప్రదేశంలో వాహనాలు నిలువద్దని, ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.