
- మత్తు మందిచ్చి చనువుగా ఉన్నట్లు వీడియోలు, ఫొటోలు
- అవి చూపించి రూ.2 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్
- అనారోగ్యం పేరుతో ఆశ్రమంలో చేరి ఇద్దరు మహిళల నిర్వాకం
- అడ్వాన్స్ కింద రూ.50 లక్షల చెక్కులు తీసుకుని వేధింపులు
- భరించలేక పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
- ముఠాను అదుపులోకి తీసుకుని రిమాండ్
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యోగా గురువును ఓ ముఠా హనీట్రాప్ చేసి భారీగా డబ్బులు దండుకోవాలని చూసింది. ఆరోగ్యం బాగాలేదని ఆశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు.. ఆయనతో ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకున్నారు.
వాటితో బ్లాక్ మెయిల్ చేసి రూ.50 లక్షలు (చెక్కులు) గుంజారు. చివరకు యోగా గురువు పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు రట్టయ్యింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దకు చెందిన ప్రముఖ యోగా గురువు, వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి ‘సీక్రెట్స్ ఆఫ్ నేచర్’ పేరుతో యోగాశ్రమం, వెల్నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారు.
అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు.. ఇక్కడికొచ్చి వారం.. పది రోజులు గడిపి వెళ్తుంటారు. హైదరాబాద్‌కు చెందిన అమర్.. అప్పుడప్పుడూ ఆశ్రమానికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో రంగారెడ్డితో పరిచయం ఏర్పడింది. అతని వద్ద డబ్బులు, భూములున్నాయని గ్రహించి మోసం చేయాలని అమర్ ప్లాన్ వేశాడు.
స్పై కెమెరాలతో ఆశ్రమంలోకి
ప్లాన్‌లో భాగంగా అమర్.. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో కొన్ని స్పై కెమెరాలు కొన్నాడు. ఆగస్టు 6న అమర్ కరీంనగర్‌కు చెందిన మంజు, విజయవాడకు చెందిన రజినితో కలిసి ఆశ్రమానికి వెళ్లాడు. ఇద్దరు మహిళలు తన బంధువులని, వారికి అనారోగ్య సమస్యలున్నాయని యోగాశ్రమంలో చేర్చుకోవాలని కోరాడు. నాలుగు రోజుల తర్వాత.. తమకు నయమైందని చెప్పి రజిని, మంజు వంట చేసి రంగారెడ్డితో పాటు ఆశ్రమంలోని వారికి వడ్డించడం ప్రారంభించారు. 15 రోజులకు ఆశ్రమం నుంచి ఇద్దరూ వెళ్లిపోయారు.
ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరింపులు
గత నెల 28న రంగారెడ్డికి అమర్ ఫోన్ చేశాడు. తర్వాత లౌడ్ స్పీకర్ పెట్టి మంజు, రజినితో మాట్లాడించాడు. ‘రంగారెడ్డి గారు.. సోషల్ మీడియాలో మీతో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్అవుతున్నయ్.. మాకు భయంగా ఉంది’ అని అన్నారు. దీంతో.. కంగారుపడ్డ రంగారెడ్డి ‘మీతో నేను దిగిన ఫొటోలు, వీడియోలా? ఎప్పుడు దిగాను.. ఎవరు తీశారు?’అని ప్రశ్నించాడు. అవన్నీ వివరంగా చెప్తామని తారామతి, బారాదరి దగ్గర ఓ హోటల్‌కు రావాలని కోరారు.
అప్పుడే రంగారెడ్డి కారులో బయలుదేరివచ్చాడు. రాగానే వారి దగ్గర ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించారు. అందులో రజిని, మంజుతో చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు కనిపించాయి. అందులో మంజు, రజిని.. రంగారెడ్డిని కౌగిలించుకుంటున్నట్టు, ముద్దులు పెడుతున్నట్టు ఉండడంతో తను ఎప్పుడూ ఇలా చేయలేదని, మార్ఫింగ్ చేశారంటూ మండిపడ్డాడు. అయితే, ఇవన్నీ నిజం ఫొటోలు, వీడియోలే అని, తమకు రూ.5 కోట్లు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో రంగారెడ్డి తాను ఆలోచించుకోవడానికి టైం కావాలని వెళ్లిపోయాడు.
సెప్టెంబర్ 15వ తేదీతో రెండు చెక్కులు
ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం రంగారెడ్డికి మళ్లీ కాల్ చేసి పిలిపించారు. తారామతి బారాదరి హోటల్ దగ్గరకు వచ్చిన రంగారెడ్డిని మంజుల, అమర్ తో పాటు రాజేశ్, మౌలాలి బెదిరించారు. కారు తాళాలు లాక్కున్నారు. రంగారెడ్డిని కారులోకి తీసుకువెళ్లి రూ.5 కోట్లు కావాలని అడిగారు. చివరకు రూ.2 కోట్లకు ఫైనల్ చేస్తామని చెప్పారు. ఈ రూ.2 కోట్లు క్యాష్ లేదంటే ఆశ్రమం సమీపంలో ఉన్న రెండెకరాలు ఇవ్వాలని కోరారు. అందులో భాగంగా అడ్వాన్స్ కింద వెంటనే రూ.50 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. భయపడిన రంగారెడ్డి.. వారిని తన ఆశ్రమానికి తీసుకువెళ్లి సెప్టెంబర్ 15వ తేదీ వేసి రూ.25 లక్షల చొప్పున 2 చెక్కులు ఇచ్చాడు.
మాటేసి నిందితులను పట్టుకున్న పోలీసులు
వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులను రంగారెడ్డి ఆశ్రయించాడు. తనకు ఏం జరిగిందో వివరంగా చెప్పాడు. ఈ నెల13న శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అమర్, రజిని, మంజు, మౌలాలి, రాజేశ్ ఫోన్ చేసిన రంగారెడ్డి.. రూ.2 కోట్లు ఇస్తానని చెప్పి తారామతి బారాదరి హోటల్‌కు రమ్మన్నాడు. విషయం ముందే గోల్కొండ పోలీసులకు చేరవేశాడు. దీంతో అక్కడే మాటేసిన పోలీసులు అందరినీ పట్టుకున్నారు. ఇప్పటికే వీరిపై కేసులున్నాయని, నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
నాకు మత్తు మందు ఇచ్చారు
ఆరోగ్యం బాగా లేదని నా ఆశ్రమానికి మంజు, రజినీ వచ్చారు. కొన్ని రోజులు ఉన్నారు. ఆరోగ్యం నయమైందని వంట చేసి వడ్డించడం మొదలుపెట్టారు. నేనూ ఆశ్రమంలోనే ఉన్న. అప్పుడు నాకు భోజనంలోనో.. లేక జ్యూస్‌లోనో మత్తు మందు కలిపి ఇచ్చి ముద్దులు ఇస్తున్నట్లు, కౌగిలించుకున్నట్లు వీడియోలు, ఫొటోలు తీశారు. వాటితో బ్లాక్ మెయిల్ చేయాలని చూశారు.
- వెంకట రంగారెడ్డి