బైక్ నంబర్ ఆధారంగా డూప్లికేట్ కీ తయారు చేస్తున్న ముఠా

బైక్ నంబర్ ఆధారంగా డూప్లికేట్ కీ తయారు చేస్తున్న ముఠా
  • ఆర్సీ కార్డులోని వివరాలు కూడా మార్చే విధంగా చిప్ లు తయారు చేస్తున్న ముఠా

హైదరాబాద్: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కే కొద్దీ దొంగలు కూడా అదే టెక్నాలజీతో చోరీలు చేస్తూ సవాల్ విసురుతున్నారు. ఎప్పటికైనా పట్టుపడాల్సిందే కదా.. అదే కోవలోనే ఈ హైటెక్ దొంగల ముఠా కూడా పోలీసులకు చిక్కింది. వీరి తెలివితేటలు.. కనిపెట్టిన యంత్రాలు చూసి పోలీసులే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టిన ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పరిధిలో చోటు చేసుకుంది. 

ఇప్పటి వరకు మనందరికీ రోటీ మేకర్, ఇండ్లీ మేకర్ మిషన్లు అంటే తెలుసు. కానీ ఎవరికైనా డూప్లికేట్ ’కీ‘ మేకర్ అంటే తెలుసా..తెలియకపోతే వీరి నుంచి తెలుసుకోవచ్చు. ఈ కొత్త మిషన్ వాహనాదారులను పరేషాన్ చేస్తుంది. ఈ మిషన్ తో... బైక్ ల నెంబర్ల ఆధారంగా డూప్లికేట్ కీ లు తయారు చేసి..వాటితో దొంగతనాలకు పాల్పడుతోంది ఈ దొంగల ముఠా. ఆర్సీ కార్డులోని వివరాలను కూడా మార్చే విధంగా చిప్ లను తయారు చేస్తోంది. 

హైదరాబాద్ నగరం పరిధిలో బండ్రవల్లి రాకేశ్, మహమ్మద్ సోయాల్ ఖాన్ ఇద్దరు ముఠాగా ఏర్పడి వాహనాలు చోరీ చేస్తున్నారు. వనస్థలిపురం, సరూర్ నగర్, ఎల్బీనగర్ పరిధిలో 13బైక్ లను, ఓ కారును చోరి చేసినట్లు  వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి దొంగిలించిన వాటిని రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితులు కారులో హైఫైగా వచ్చి..దొంగతనం చేస్తున్నట్లు తెలిపారు.