పిల్లలను అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్

పిల్లలను అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్
  •  16 మంది పిల్లలను కాపాడిన పోలీసులు 
  • మొత్తం 11 మంది అదుపులోకి.. మరో ముగ్గురి కోసం గాలింపు
  • ఎన్జీఓ స్టింగ్ ఆపరేషన్​తో గుట్టురట్టు 
  • పీర్జాదిగూడలోని ఆర్ఎంపీ క్లినిక్​పై దాడితో దందా బట్టబయలు 
  • మీడియాకు వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ తరుణ్​జోషి  

సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్​లో చిన్నారులను అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో మొత్తం 14 మంది ఉండగా.. 11 మందిని మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ముఠా సభ్యుల నుంచి16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్టు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం పీర్జాదిగూడలో శోభారాణి అనే ఆర్ఎంపీ డాక్టర్ రూ.4.50 లక్షలకు ఓ శిశువును విక్రయించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె క్లినిక్ పై దాడి చేసి పసిపాపను స్వాధీనం చేసుకున్నారు. 

శోభారాణికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సమాచారం రాబట్టి ముఠాకు చెందిన మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను నేరేడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్ ఆఫీసులో సీపీ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ముఠా మొత్తం 50 మంది పిల్లలను అమ్మిందని, అందులో 16 మంది పిల్లలను రెస్క్యూ చేశామని తెలిపారు. మిగతా 34 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ‘‘ఫీర్జాదిగూడ రామకృష్ణనగర్ కాలనీలో ఉండే ఐతె శోభారాణి స్థానికంగా ఓ క్లినిక్ నిర్వహిస్తోంది. 

ఆమెతోపాటు అదే కాలనీకి చెందిన షేక్ సలీమ్ పాషా, ఉప్పల్ ఆదర్శనగర్ కాలనీకి చెందిన చింత స్వప్న కలిసి పిల్లలను అమ్మడం ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇతర రాష్ర్టాలకు చెందిన మరికొందరితో కలిసి పసిబిడ్డలను విక్రయిస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. పేద కుటుంబాల వారికి డబ్బు ఆశ చూసి వారి నుంచి నెల నుంచి ఆరునెలల వయస్సు ఉన్న పసిపిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ఆ పిల్లలను తెలుగు రాష్ట్రాల్లో అవసరమున్న వారికి  రూ.4 లక్షల నుంచి రూ.5.50 లక్షలకు అమ్ముతున్నారు.

 వీరి దందాపై సమాచారం అందడంతో ఈ నెల 22న మేడిపల్లి పోలీసులు శోభారాణి క్లినిక్ పై రెయిడ్ చేశారు. అమ్మకానికి పెట్టిన పసిపాపను స్వాధీనం చేసుకుని శోభారాణితోపాటు షేక్ సలీమ్, స్వప్నను అరెస్టు చేశారు” అని సీపీ వివరించారు. 

ఢిల్లీ, పుణె నుంచి పిల్లలను తెచ్చి..

పిల్లలను అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాలో శోభారాణి, పాషా, స్వప్నతోపాటు మరో 11 మంది ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఘట్కేసర్ అన్నోజిగూడకు చెందిన సెక్యూరిటీ బండారి హరిహర చేతన్ అలియాస్ హరి(34), అతని తల్లి  బండారి పద్మ(65), విజయవాడకు చెందిన బలగం సరోజ(32), ముదావత్ శారద అలియాస్ షకీలా పటాన్(39), మహబూబ్ నగర్ బల్మూర్ ఉప్పుగూడకు చెందిన ముదావత్ రాజు(30), విజయవాడకు చెందిన పటాన్ ముంతాజ్ అలియాస్ హసీనా(28), జగన్నాథం అనురాధ(27), కుషాయిగూడ చర్లపల్లికి చెందిన యాట మమత(30), ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణెకు చెందిన కన్నయ్య కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ దందా చేస్తున్నారని తెలిపారు.

 వీరిలో కిరణ్, ప్రీతి, కన్నయ్య ఢిల్లీ, పుణె, ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను సప్లై చేస్తుండగా.. మిగతా వారంతా ఆయా ప్రాంతాల్లో ఏజెంట్లుగా, సబ్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. ఢిల్లీ, పుణెలో పేద కుటుంబాలకు డబ్బులు ఆశ చూపి ఒక్కో పసిబిడ్డను రూ. 50 వేలకు కొని ఏజెంట్లకు అప్పగిస్తున్నారు. ఏజెంట్లు ఆ పిల్లలను రూ.1.80 లక్షల నుంచి రూ. 5.50 లక్షలకు అమ్ముతున్నారు. నిందితుల్లో ముదావత్ రాజు, ముదావత్ శారద భార్యాభర్తలని, వేర్వేరు ప్రాంతాల్లో ఏజెంట్లుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

 కిరణ్, ప్రీతి, కన్నయ్య పరారీలో ఉన్నారని, వారి కోసం ఢిల్లీ, పుణెకు ప్రత్యేక టీంలను పంపామన్నారు. కాగా, ఈ ముఠాలో ముగ్గురు పాత నేరస్తులు ఉన్నట్టు గుర్తించారు. బండారి పద్మ చీటింగ్ కేసులో జైలుకు వెళ్లగా.. బలగం సరోజ, ముదావత్ శారద.. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

ఎన్జీఓ స్టింగ్ ఆపరేషన్​తో గుట్టురట్టు 

శోభారాణి, మరికొందరు కలిసి పిల్లలను అమ్ముతున్న విషయం తెలియడంతో స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్టింగ్ ఆపరేషన్ చేశారు. తమకు ఒక ఆడపిల్ల కావాలని ఆ ఎన్జీఓ ప్రతినిధులు శోభారాణిని సంప్రదించారు. తమ వద్ద మూడు నెలల పసికందు ఉన్నదని, రూ. 4.50 లక్షలకు అమ్ముతామని శోభారాణి చెప్పింది. అడ్వాన్స్ గా రూ. 20 వేలు ఇవ్వాలని, ఆ తర్వాతే పాపను చూపిస్తామంది. 

మొత్తం డబ్బులు ఇచ్చాకే పాపను అప్పగిస్తామని బేరమాడింది. దీంతో వారు రూ. 20 వేలు అడ్వాన్స్ కట్టి, మిగతా డబ్బులు పాపను ఇచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత వచ్చిన ఎన్జీఓ ప్రతినిధులకు విజయవాడ నుంచి తీసుకొచ్చిన పాపను చూపించారు. అప్పటికే ఎన్జీఓ ప్రతినిధులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి నిందితులను అరెస్ట్ చేశారు. 

పాపను అమీర్ పేట్ లోని శిశువిహార్ కు తరలించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కలిసి ముఠాగా ఏర్పడినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు.