తాగడానికి, స్నానానికి గంగనీళ్లు పనికిరావు : పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు

తాగడానికి, స్నానానికి గంగనీళ్లు పనికిరావు : పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు

గంగా నదిని అత్యంత పవిత్రమైనదిగా హిందువులు పూజిస్తారు. అందులో దిగి మూడు మునకలేసి తరిస్తుంటారు. కుంభమేళా, మహాకుంభమేళా, అర్ధ కుంభమేళా అయితే, భక్తులతో గంగ తీరం కిటకిటలాడుతుంది. మరి, మనం అంత పవిత్రంగా భావించే గంగ నీళ్లు అంతే పవిత్రంగా ఉన్నాయా? అంటే.. అస్సలు లేవంటోంది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ). వారణాసి/కాశిలోని పలు ఘాట్లు, అలహాబాద్​లోని సంగమం సహా చాలా చోట్ల తాగడానికి గానీ, కనీసం స్నానం చేయడానికిగానీ ఆ నీళ్లు పనికిరావని తేల్చి చెప్పింది. నది ప్రవహిస్తున్న ఏడు చోట్ల మాత్రమే నీళ్లు తాగేందుకు అనువుగా ఉన్నాయని తెలిపింది. నది నీళ్లలో కోలి ఫాం బ్యాక్టీరియా చాలా చాలా ఎక్కువగా ఉందని, అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. గురువారం తాజాగా నదీ కాలుష్యంపై సీపీసీబీ ఓ నివేదిక ఇచ్చింది. నది ప్రవహించే 86 ప్రాంతాల్లో మానిటరింగ్​ స్టేషన్లను సీపీసీబీ ఏర్పాటు చేసింది.

అందులో 78 ప్రాంతాల్లో అసలు ముట్టుకోవడానికి కూడా పనికిరావని చెప్పింది. ఏడు ప్రాంతాల్లో నీటిని శుద్ధి చేసుకున్నాక మాత్రమే తాగేందుకు అనువుగా ఉంటాయని చెప్పింది. 18 ప్రాంతాల్లో స్నానం చేయడం అంత ప్రమాదమేమీ కాదని, 62 ప్రాంతాల్లో మాత్రం అడుగు కూడా పెట్టలేని విధంగా గంగ తయారైందని చెప్పింది. క్లాస్​ ఏ కింద భాగీరథి, రుద్రప్రయాగ్​, దేవప్రయాగ్​, రాయ్​వాలా (ఉత్తరాఖండ్​), ఘర్​ముక్తేశ్వర్​, రుషికేశ్​, బిజ్నోర్​, అలీగఢ్​, పశ్చిమబెంగాల్​లోని డైమండ్​ హార్బర్​లలో నది నీటిని శుద్ధి చేసుకుని తాగొచ్చని చెప్పింది. క్లాస్​ బీ తాగడానికి పనికొచ్చే ప్రాంతాల్లో స్నానాలు చేయొచ్చని వివరించింది. నమామి గంగ ప్రాజెక్టును మరింత సమగ్రంగా నిర్వహించాలంది.