బెంగళూరులో గ్యాంగ్‌రేప్.. వీడియో వైరల్

బెంగళూరులో గ్యాంగ్‌రేప్.. వీడియో వైరల్
  • బెంగళూరులో గ్యాంగ్ రేప్
  • వీడియో వైరల్.. ఆరుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
  • క్రైమ్ సీన్‌‌‌‌‌‌‌‌ రీకన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌లో పరారీకి నిందితుల యత్నం 
  • పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలు 

బెంగళూరు: బెంగళూరులో ఘోరం జరిగింది. ఓ మహిళపై ఆరుగురు తీవ్రంగా దాడి చేసి, గ్యాంగ్ రేప్​కు పాల్పడ్డారు. ఈ ఘటన 6 రోజుల క్రితమే జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన బెంగళూర్ పోలీసులు.. గురువారం రామమూర్తి నగర్ లో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. క్రైమ్ సీన్ రీకన్‌‌స్ట్రక్షన్ కోసం నిందితులను పోలీసులు శుక్రవారం స్పాట్​కు తీసుకెళ్లారు. అయితే ఆ టైమ్ లో ఇద్దరు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా, వారి కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించి, ట్రీట్ మెంట్ అందిస్తున్నామని బెంగళూర్ ఈస్ట్ డీసీపీ శ్రణప్ప తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం వేరే రాష్ట్రంలో ఉందని, ఆమెను తీసుకొచ్చేందుకు పోలీసులు వెళ్లారని చెప్పారు. ఆమె తిరిగొచ్చినంక స్టేట్ మెంట్ రికార్డు చేస్తామని పేర్కొన్నారు.

అందరూ బంగ్లాదేశీయులే.. 
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు వారందరూ ఒకే గ్రూపుకు చెందినవారని, అందరూ బంగ్లాదేశీయులేనని పోలీసులు తెలిపారు. ఆర్థికపరమైన గొడవల కారణంగానే నిందితులు బాధితురాలిపై రేప్ కు పాల్పడ్డారని చెప్పారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో గ్లాస్ బాటిల్ ను చొప్పించారని, ఇదంతా నిందితుల్లో ఒకరు రికార్డు చేశారని పేర్కొన్నారు. బాధితురాలు కూడా బంగ్లాదేశ్ కు చెందినదేనని, ఆమెను అక్రమంగా ఇండియాకు తీసుకొచ్చారన్నారు. ఈ వీడియో మొదట బంగ్లాదేశ్ లో వైరల్ అయింది. అక్కడి పోలీసులు విచారణ చేపట్టగా, ఆ ఘటన ఇండియాలో జరిగినట్లు గుర్తించారు. ఆ వీడియోను చూసిన అస్సాం పోలీసులు.. అది తమ రాష్ట్రంలోనే జరిగినట్లు పొరపడ్డారు. నిందితుల ఫొటోలను తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసి, నిందితుల ఆచూకీ చెబితే బహుమానం ఇస్తామని ప్రకటించారు.

నిందితులను కఠినంగా శిక్షిస్తాం: సీఎం 
ఇది దారుణమైన ఘటన అని కర్నాటక సీఎం యెడియూరప్ప అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ ఘటన వెనుక హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్ హస్తం ఉందని, ఇందులోని మరికొంత మంది కేరళలో ఉన్నట్లు నిందితులు విచారణలో తెలిపారని హోంమంత్రి బస్వరాజ్ బొమ్మై తెలిపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. ఈ ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.