IPL 2026: ప్లే ఆఫ్స్ వేళ ఆర్సీబీకి గుడ్ న్యూస్.. జట్టులోకి తిరిగొస్తోన్న విధ్వంసకర ప్లేయర్

IPL 2026: ప్లే ఆఫ్స్ వేళ ఆర్సీబీకి గుడ్ న్యూస్.. జట్టులోకి తిరిగొస్తోన్న విధ్వంసకర ప్లేయర్

బెంగళూర్: ఐపీఎల్ 19 ప్లే ఆఫ్స్ వేళ డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీకి భారీ గుడ్ న్యూస్. ఆర్సీబీ విధ్వంసకర ప్లేయర్ ఫిల్ సాల్ట్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‎లో ఉన్న సాల్ట్ ఈ వారం చివర్లో ఇండియాకు రానున్నట్లు ప్రముఖ క్రికెట్ వెబ్‎సైట్ క్రిక్ ఇన్ఫో నివేదించింది. లీగ్ దశలో భాగంగా 2026, ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‎లో సాల్ట్ గాయపడ్డాడు.

ఫీల్డింగ్ చేస్తుండగా చేతి వేలికి గాయమైంది. దీంతో కొన్ని రోజుల విరామం కోసం తిరిగి ఇంగ్లాండ్ వెళ్లి కుటుంబంతో టైమ్ స్పెండ్ చేశాడు. గాయం తక్కువ కావడం, మరోవైపు ఐపీఎల్ 19 ప్లే ఆఫ్స్ రేసు షురూ కానుండటంతో తిరిగి ఇండియాకు వస్తున్నాడు. అయితే 2026, మే 22న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఆర్‌సీబీ చివరి లీగ్ దశ మ్యాచ్‌కు సాల్ట్ అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ ప్లే ఆఫ్స్ మ్యాచులకు మాత్రం సాల్ట్ కచ్చితంగా అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ప్లే ఆఫ్స్ వేళ డేంజరస్ బ్యాటర్ సాల్ట్ తిరిగి రావడం ఆర్సీబీ కలిసి వస్తుందంటున్నారు క్రీడా విశ్లేషకులు.

జాకబ్ బెథెల్ ఫెయిల్..!

గాయం కారణంగా సాల్ట్ జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో మరో ఇంగ్లాండ్ ప్లేయర్ జాకబ్ బెథెల్‌ను ఆడించింది ఆర్సీబీ. కానీ బెథెల్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఒక్క మ్యాచ్‎లో కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. 2026 T20 ప్రపంచ కప్‌లో రాణించిన మాదిరిగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసిన బెథెల్ ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 96 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. అతని అత్యధిక స్కోరు 27 కావడం గమనార్హం. సాల్ట్ రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో జట్టులో బెథెల్ స్థానం  గల్లంతు కావడం పక్కా. 

టాప్ ప్లేస్‎లో ఆర్సీబీ

ఐపీఎల్ 19లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ పేరు తగ్గ ఆట తీరు కనబర్చింది. లీగ్ దశలో ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన పటిదార్ సేన 9 విజయాలు సాధించగా.. నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైంది. మొత్తం 18 పాయింట్లతో టేబుల్ టాపర్‎గా కొనసాగుతూ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది ఆర్సీబీ. తమ చివరి లీగ్ మ్యాచును మే 22న హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది ఆర్సీబీ. ఈ మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది ఆర్సీబీ. 

►ALSO READ | టీమిండియాలో కెప్టెన్సీ రాజకీయం?.. రిషభ్ పంత్ సిస్టర్ వైరల్ పోస్ట్‌తో మొదలైన రచ్చ!