అమెరికా కల సాకారమైందని మురిసిపోతున్న వేళ.. ఒక్క లేఆఫ్ ఈమెయిల్ వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేస్తోంది. మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి టెక్ దిగ్గజాలు భారీగా ఉద్యోగాల కోతల్లో చిక్కుకున్న H-1B వీసాలపై పనిచేస్తున్న భారతీయులు ఇప్పుడు సంక్షోభంలో మునిగిపోయారు. ఉద్యోగం పోయిన 60 రోజుల్లోగా మరో స్పాన్సర్‌ను వెతుక్కోవాలనే అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రూల్ వారి పాలిట డెడ్‌లైన్‌గా మారింది. గడువు లోపు కొత్త ఉద్యోగం దొరకకపోతే దేశం విడిచి వెళ్లాల్సిందేనన్న ఆందోళన వారికి నిద్ర లేకుండా చేస్తోంది.
ఈ 60 రోజుల గడువును మరికొంత కాలం పొడిగించుకోవడానికి చాలా మంది ఉద్యోగులు తాత్కాలికంగా B-2 విజిటర్ వీసాకు మారేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇమ్మిగ్రేషన్ వాతావరణం ఈ మార్గాన్ని కూడా క్లిష్టం చేసింది. అధికారులు ఇప్పుడు అదనపు పత్రాలను డిమాండ్ చేస్తూ.. బి-1/బి-2 వీసా దరఖాస్తులపై భారీగా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్‌లు, తిరస్కరణ నోటీసులు జారీ చేస్తున్నారు. చట్టబద్ధంగా అవకాశం ఉన్నప్పటికీ.. వీసా మార్పిడికి ఆమోదం పొందడం ఐటీ ఉద్యోగులకు గగనమైపోతోంది.
ఏఐ కారణంగా టెక్ రంగంలో లేఆఫ్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే.. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు కేవలం కొన్ని నెలల్లోనే 144 టెక్ కంపెనీలు లక్షా 10వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో వేలాది మంది భారతీయులే ఉన్నట్లు అంచనా. హెచ్-1బి వీసా ప్రోగ్రామ్‌లో భారతీయులదే అగ్రస్థానం. గతేడాది యూఎస్ అధికారులు ఆమోదించిన మొత్తం వీసా పిటిషన్లలో దాదాపు 2.8 లక్షలు భారతీయులవే. అయితే ఈ భారీ డిపెండెన్సీ ఇప్పుడు వారికి పెద్ద శాపంగా మారింది.
ALSO READ : కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్: ఐటీ కంపెనీల్లో మారిన CTC..
ఈ సంక్షోభం కేవలం ఒక జాబ్ లాస్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఒక దశాబ్ద కాలంగా గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ కోసం నిరీక్షిస్తూ అమెరికాలోనే ఇళ్లు కొనుక్కుని, అక్కడే పుట్టిన పిల్లల చదువులు చూసుకుంటున్న కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా అమెరికా టెక్ రంగానికి సేవ చేసినా.. చివరకు తమను ఇలా ఒంటరిగా వదిలేశారనే బాధ వారిలో కనిపిస్తోంది. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయంగా ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు, ఓ-1 వీసాల వైపు చూస్తుండగా.. మరికొందరు కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ, యూరప్ దేశాలకు వలస వెళ్లాలని ప్రయత్నిస్తూ మెుత్తానికి ఇండియాకు తిరిగి రాకుండా చూసుకునేందుకు ఉన్న అన్ని ప్రయత్నాలూ చేసేస్తున్నారు.
