ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023లో గంగూబాయ్ కఠియావాడి మూవీ అదరగొట్టేసింది. ఈ మూవీ ఏకంగా 9 అవార్డులు గెలుచుకుని సత్తా చాటింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి, అలియా భట్ కాంబోలో ఈ మూవీకి.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు వంటి విభాగాలతో పాటు మొత్తం తొమ్మిది అవార్డ్స్ ని గెలుచుకుంది. గురువారం రాత్రి ముంబయిలో జరిగిన ఈ 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకకు బాలీవుడ్ టాప్ స్టార్స్ హాజరై కనువిందు చేశారు.
గంగూబాయి తరువాత రాజ్ కుమార్ రావు నటించిన బదాయ్ దో సినిమాకి కూడా అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి విభాగాలతో సహా మొత్తం ఆరు అవార్డులను గెలుచుకుంది ఈ మూవీ. అయితే.. ఈ ఇయర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కోసం అత్యధిక నామినేషన్స్ లో నిలిచిన "ది కాశ్మీర్ ఫైల్స్" మూవీకి ఒక్క అవార్డ్ కూడా రాకపోవడం విశేషం.