కాంగ్రెస్ రౌడీషీటర్‌‌‌‌‌‌‌‌కు టికెట్ అమ్ముకుంది: గంగుల కమలాకర్ 

కాంగ్రెస్ రౌడీషీటర్‌‌‌‌‌‌‌‌కు టికెట్ అమ్ముకుంది: గంగుల కమలాకర్ 

కరీంనగర్, వెలుగు :  భూకబ్జాలకు సంబంధించి 30కి పైగా కేసుల్లో ప్రమేయమున్న రౌడీషీటర్‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్ టికెట్ అమ్ముకుందని మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తాడో, లేక కోర్టుల చుట్టూ తిరుగుతాడో ఆయనకే తెలియాలన్నారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్ , మందులపల్లి గ్రామాలతోపాటు సిటీలోని 22, 23, 40వ డివిజన్ లో ఆయన ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. మున్నూరు కాపు, వడ్డెర, నాయీబ్రాహ్మణ కులస్తుల ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేసి వృథా చేయొద్దన్నారు.

 నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు కావాలో... లేదా ఎన్నికలప్పుడే కనిపించే, జైలుకు వెళ్లొచ్చే నాయకుడు కావాలో ఆలోచించుకోవాలన్నారు. పచ్చని తెలంగాణను మళ్లీ  ఆంధ్రాలో కలిపి... దోచుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్​ ముసుగులో షర్మిల, కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నారన్నారు.  అనంతరం రేకుర్తిలో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు కట్టబెట్టడంలో కులబాంధవులు ప్రముఖ పాత్ర పోషించారన్నారు. పద్మనాయక మినీ కల్యాణమండపంలో నాయీబ్రాహ్మణ, వడ్డెర సంఘం కులస్తులతో ఆత్మీయ సమ్మేళనంలో నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ సునీల్ రావు, తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్, జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ పాల్గొన్నారు.