ఇండిగోలో మరోసారి వాటాల అమ్మకం

ఇండిగోలో మరోసారి వాటాల అమ్మకం

న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్​లైన్స్​ ప్రమోటర్లలో ఒకరైన గంగ్వాల్​ ఫ్యామిలీ మరోసారి రూ. 3,730 కోట్ల విలువైన షేర్లను బుధవారం అమ్మనుంది. ఈ అమ్మకాన్ని బ్లాక్​డీల్​ ద్వారా జరపనున్నారు. 1.56 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ. 2,400 చొప్పున విక్రయించడానికి గంగ్వాల్​ ఫ్యామిలీ నిర్ణయించుకుంది. సోమవారం క్లోజింగ్​ రేటు కంటే 5.8 శాతం డిస్కౌంట్​కు గంగ్వాల్​ ఫ్యామిలీ తమ వాటాలను అమ్మనుంది. మోర్గాన్​స్టాన్లీ, జేపీ మోర్గాన్​, గోల్డ్​మన్​ శాచ్స్​ఈ బ్లాక్​డీల్​కు బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇండిగో ఎయిర్​లైన్స్​లో గంగ్వాల్​ ఫ్యామిలీకి 29.72 శాతం వాటా ఉంది. జూన్​2023 చివరినాటికి  కంపెనీలో  ప్రమోటర్ల వాటా 67.77 శాతం. బీఎస్ఈ డేటా ఈ విషయం వెల్లడిస్తోంది. 

ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం చూస్తే గంగ్వాల్​ ఫ్యామిలీ చేతిలోని వాటాల విలువ రూ. 29,218 కోట్లవుతుంది. ఇండిగో ఎయిర్​లైన్స్​ను నడిపే ఇంటర్​గ్లోబ్​ ఏవియేషన్​ కంపెనీ మొత్తం మార్కెట్​ విలువ రూ. 98,313 కోట్లు. జూన్​ 2022 నాటికి గంగ్వాల్​ ఫ్యామిలీ వాటా 36.66 శాతం. అప్పటి నుంచి వరసగా ఆ వాటాను  తగ్గించుకుంటూనే ఉన్నారు. కిందటేడాది ఫిబ్రవరిలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి రాకేష్​ గంగ్వాల్​ వైదొలిగారు. రాబోయే అయిదేళ్లలో తన వాటాలను అమ్మాలనుకుంటున్నట్లు అప్పట్లోనే  వెల్లడించారు. 2023–24 మొదటి క్వార్టర్లో ఇండిగో ఎయిర్​లైన్స్​కు రూ. 3,090 కోట్ల నికర లాభం వచ్చింది. 

ఇదే కాలానికి కంపెనీ రెవెన్యూ రూ. 17,160 కోట్లు. ఇంతకు మునుపెన్నడూ ఇండిగో ఎయిర్​లైన్స్​కు ఇంత క్వార్టర్లీ లాభం, రెవెన్యూ రాలేదు. జూన్ ​నెలలో 2.62 కోట్ల మంది ప్రయాణికులను ఇండిగో ఎయిర్​లైన్స్​ హ్యాండిల్​ చేసింది. ఈ ఎయిర్​లైన్స్​ చేతిలో 316 విమానాలున్నాయి. కిందటి క్వార్టర్లో కొత్తగా 12 విమానాలను కంపెనీ యాడ్​ చేసుకుంది.