రాజమండ్రి నుంచి హైదరాబాద్ సిటీకి గంజాయి

రాజమండ్రి నుంచి హైదరాబాద్ సిటీకి గంజాయి
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన నార్త్​జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • 130 కిలోల గాంజా స్వాధీనం

కంటోన్మెంట్, వెలుగు:  గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని  నార్త్​జోన్​ టాస్క్​ఫోర్స్, బోయిన్​పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.32.50లక్షల విలువైన 130 కిలో గంజాయి, 2 కార్లు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బోయిన్​పల్లి పీఎస్​లో  నార్త్​జోన్​అడిషనల్ డీసీపీ మధుసూదన్​రావు మీడియాకు వివరాలు వెల్లడించారు.

రాజస్థాన్​కు చెందిన జై సింగ్ భాటి (44), రూప్ చంద్  కచవా (27), ప్రేమ్ కుమార్ పర్మార్ (35) కొన్నేండ్ల కిందట బతుకుదెరువు కోసం  సిటీకి వచ్చి  జీడిమెట్ల ప్రాంతంలోని సుభాష్​నగర్​లో నివాసం వుంటున్నారు. జైసింగ్     ఫాస్ట్ ఫుడ్ సెంటర్  నిర్వహిస్తుండగా, రూప్​చంద్​ కిరాణా షాపు ,  ప్రేమ్​కుమార్  చిన్న వ్యాపారం చేస్తున్నాడు. జైసింగ్​, ప్రేమ్​కుమార్ ఇద్దరికి వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో ​ మరో బిజినెస్ చేయాలనుకున్నారు.  

అందు కోసం మెదక్ జిల్లా లోని కుచారంలో ఓ స్థలాన్ని అద్దెకు తీసుకుని అందులో  డాంకీ  ఫామ్​ను నడిపారు. అందులోనూ నష్టపోవడంతో       గంజాయి  అమ్మేందుకు స్కెచ్ వేశారు. తమ ఫ్రెండ్ రూప్​చంద్​తో కలిసి గంజాయి సప్లయ్ మొదలుపెట్టారు. సిటీలో గంజాయి వ్యాపారం చేస్తున్న మంగిలాల్ , ధర్మేంద్రతో జైసింగ్, ప్రేమ్ కుమార్, రూప్​ చంద్​కు 4 నెలల కిందట పరిచయం ఏర్పడింది.  

ఈ ముగ్గురు వీరి వద్ద గంజాయిని కొని స్టూడెంట్లకు, యువతకు అమ్మేవారు. పెద్ద మొత్తంలో గంజాయి అమ్మేందుకు ప్లాన్ చేసి మంగిలాల్, ధర్మేంద్రను ఆశ్రయించారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన గంజాయి వ్యాపారి రాజన్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుందని మంగిలాల్, ధర్మేంద్ర ఆ ముగ్గురికి చెప్పారు.  దీంతో జైసింగ్, ప్రేమ్ కుమార్, రూప్​చంద్​ ముగ్గురు కలిసి రాజమండ్రికి వెళ్లి రాజన్ నుంచి 130 కిలోల గంజాయిని కొన్నారు.

రెండు కార్లలో వాటిని తీసుకొని సోమవారం రాత్రి సిటీకి వచ్చారు. దీని గురించి సమాచారం అందుకున్న నార్త్ జోన్​ టాస్క్​ఫోర్స్, బోయిన్​పల్లి పోలీసులు సికింద్రాబాద్​లోని  డైమండ్​  పాయింట్ హోటల్​ చౌరస్తాలో వీరి కార్లను అడ్డుకున్నారు. 130 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జైసింగ్​, రూప్​చంద్​, ప్రేమ్​కుమార్​ను అరెస్టు చేశారు. వీరికి గంజాయి సప్లయ్ చేసిన రాజన్ పరారీలో ఉన్నట్లు  అడిషనల్ డీసీపీ మధుసూదన రావు తెలిపారు.