నిజామాబాద్, వెలుగు: గంజాయి సేవిస్తూ ఇతరులకు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. అమ్మకాల్లో ముఠాకు ఏజెంట్లుగా పనిచేసిన వారిని కూడా గుర్తించామన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మీడియాతో మాట్లాడారు. బాల్కొండ మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో గంజాయి ముఠా ఉందనే సమాచారంతో దాడి నిర్వహించి ఆర్మూర్‌కు చెందిన మహ్మద్ అంజద్ నుంచి 1.2 కిలోల గంజాయితో పట్టుకున్నామన్నారు.
కొనుగోలు చేయడానికి వచ్చిన మహ్మద్ నయీం, చిల్వేరు మనోజ్‌కుమార్, మైనర్ బాలుడు దొరికారన్నారు. వారిని విచారించి బాల్కొండకు చెందిన జక్కుల గోవింద్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మహారాష్ట్రలోని కిన్వట్ నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నారని, కమీషన్ ఏజెంట్లను నియమించుకున్నారన్నారు.
మొబైల్ ఫోన్లో ఆర్డర్లు బుక్ చేసుకుంటున్నట్లు గుర్తించామని తెలిపారు. మైనర్ సహా తమకు పట్టుబడిన ఆరుగురు నిందితులను రిమాండ్‌కు తరలించి పరారీలో ఉన్న మున్నీ, వహీద్ సుల్తాన్, సోఫియాన్ కోసం గాలిస్తున్నామన్నారు. సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై శైలేందర్ తదితరులు ఉన్నారు.
