రికార్డు స్థాయిలో గణపతి లడ్డూల వేలం.. బాలాపూర్ లడ్డూ @27 లక్షలు

రికార్డు స్థాయిలో గణపతి లడ్డూల వేలం.. బాలాపూర్ లడ్డూ @27 లక్షలు

హైదరాబాద్: గతేడాది లెక్కనే ఈసారి గణపతి లడ్డూలు రికార్డు సృష్టించాయి. బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షల ధర పలికింది. గతేడాది కంటే రూ.2.40 లక్షలు ఎక్కువ.  లడ్డూ వేలంలో 36 మంది పాల్గొనగా చివరకు రంగారెడ్డి జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దాసరి దయానంద్ రెడ్డి దక్కించుకున్నారు. 

గురువారం ఉదయం 8 గంటలకు మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన గణేశ్​విగ్రహం10 గంటలకు లడ్డూ వేలం పాట నిర్వహించే బొడ్రాయి వద్దకు చేరింది. అనంతరం 10:38కు వేలం పాట మొదలైంది. గణేష్ ఉత్సవ కమిటీ తరపున రూ.1,016తో ప్రారంభమైన వేలం చివరకు రూ. 27లక్షలకు ముగిసింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేయర్ చిగురింత పారిజాత నరసింహా రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితరెడ్డి పాల్గొన్నారు. 

 ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది..

బాలాపూర్ లడ్డూను రూ. లక్షలు పెట్టి దక్కించుకున్న వారికి పలు ప్రయోజనాలు కలుగుతాయనే నమ్మకం ప్రచారంలో ఉంది. మొదట భక్తిగా.. తర్వాత సెంటిమెంట్ గా.. ఆ తర్వాత ప్రెస్టీజ్ ఇష్యూగా మారిపోయింది. బాలాపూర్ లడ్డూ వేలం రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందింది. లడ్డూను దక్కించుకునేందుకు బాలాపూర్ గ్రామస్తులే కాదు. ఇతర ప్రాంతాల వారు వేలంలో పాల్గొనేందుకు వస్తారు. వేలంలో లడ్డూను సొంతం చేసుకున్న వారు స్థానికులైతే ఆ మొత్తాన్ని మరుసటి ఏడాది చెల్లించాల్సిన వెసులుబాటు ఉంది. 

ఇతర ప్రాంతాలవారైతే గణేశ్ ఉత్సవ కమిటీకి వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 1994లో బాలాపూర్​ గణనాథుని లడ్డూ ప్రసాదం వేలంను ప్రారంభించగా.. మొదటిసారి కొలన్​ మోహన్ రెడ్డి రూ.450కు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి వేలం పాటలో లడ్డూ ధర పెరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు లడ్డూ వేలం చరిత్రలో కొలన్ కుటుంబం 9 సార్లు సొంతం చేసుకుంది. 2020కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు చేశారు.(సీఎం కేసీఆర్ కు అందించారు.)

వివిధ ప్రాంతాల్లో..

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మధురాపురంలో రెడ్డి సేవా సమితి వినాయక లడ్డూను రూ.11 లక్షలకు అదే గ్రామానికి చెందిన శేరి పర్వత రెడ్డి దక్కించుకున్నారు. మణికొండ మున్సిపాలిటీలో నవ జ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన గణనాథుని లడ్డూ ప్రసాదాన్ని  రూ. 9 లక్షలకు ముంగి మోహన్ రెడ్డి  కైవసం చేసుకున్నారు. 

కేపీహెచ్ బీ డివిజన్ సర్దార్ పటేల్ నగర్ లోని వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపయ్య లడ్డూను కాలనీకి చెందిన ఉమామహేశ్వరరావు రూ. 5 లక్షల వెయ్యికి కైవసం చేసుకున్నారు.హుడా కాలనీ తానీషా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో  గణనాథుని లడ్డూను  రూ. 3 లక్షల 25 వేలకు మణికొండ మున్సిపాలిటీ  వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి  కైవసం చేసుకున్నారు. 

మేడిబావి గణేశ్​ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన గణేశ్ మండపం వద్ద లడ్డూ ప్రసాదాన్ని రూ.2 లక్షల 75 వేలకు లక్ష్మినారాయణ అనే వ్యక్తి దక్కించుకున్నాడు.పార్శిగుట్ట సంజీవపురంలో గణనాథుని లడ్డూ ప్రసాదాన్ని పద్మారావు అనే మేస్త్రీ లక్షా 7 వేల 500కు దక్కించుకున్నాడు.