తెలంగాణలో 94 శాతం ప్రజలకు.. పక్కాగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటది

 తెలంగాణలో 94 శాతం ప్రజలకు.. పక్కాగా ఫైనాన్షియల్ ప్లానింగ్  ఉంటది
  • తెలంగాణలో చాలా మందికి అవగాహన
  • 87 శాతం మందికి బీమా గురించి తెలుసు
  • వెల్లడించిన ఐఏసీ స్టడీ రిపోర్ట్​

హైదరాబాద్​, వెలుగు:  తెలంగాణలో 94 శాతం మంది ప్రజలు ముందుగానే ఆర్థిక ప్రణాళిక వేసుకోవడానికి ఇష్టపడతున్నారని, 87 శాతం మందికి జీవిత బీమా పొదుపు పథకాల గురించి అవగాహన ఉందని వెల్లడయింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్సూరెన్స్​ అవేర్​నెస్​ కమిటీ (ఐఏసీ- ), మార్కెట్​ రీసెర్చ్​ సంస్థలు ఐఎంఆర్​బీ, కాంటర్​తో కలసి తెలంగాణలో నిర్వహించిన  స్టడీ ప్రకారం, తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతవాసులు ఆర్థిక విషయాల్లో ముందుచూపుతో ఉన్నారు. 
 
ప్రచారానికి ప్రాధాన్యం

 సబ్​సే పెహ్లే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రచారంలో భాగంగా, తెలంగాణలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఐసీఏ ప్రకటించింది.  పొదుపు, చైల్డ్ ప్లాన్ల గురించి  ప్రాంతీయ టీవీ చానెల్స్​, డిజిటల్ ఇన్​ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం చేయనుంది.  జీవిత బీమాను ఉపయోగించి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకున్న కుటుంబాల గురించి తెలియజేస్తామని కమిటీ కో–చైర్మన్​ వెంకటాచలం చెప్పారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పాలసీల అమ్మకం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని చెప్పారు. స్మార్ట్​ఫోన్ ​వాడకం పెరిగాక ఆన్​లైన్​లో పాలసీలు తీసుకోవడం ఎక్కువయిందని అన్నారు.

 స్టడీలోని కీలక విషయాలు:
    
 జీవిత బీమా పొదుపు పథకాలు చాలా ముఖ్యమని తెలంగాణలో 100 శాతం మందికి తెలుసు. 90 శాతం మంది రెస్పాండెంట్లు జీవిత బీమా గురించి టీవీ ప్రకటనల ద్వారా తెలుసుకున్నారు. 56 శాతం మందికి బీమా ఏజెంట్ల ద్వారా అవగాహన కలిగింది.
    
38 శాతం మంది రాబోయే 3 నెలల్లో జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 78 శాతం మందికి జీవిత బీమాలో పొదుపు పథకాలు ఉన్నాయని తెలుసు.
    
54 శాతం మందికి చైల్డ్ ప్లాన్లపై అవగాహన ఉంది.  94 శాతం మంది అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండటానికి ముందుగానే ప్లాన్​చేసుకుంటామని తెలిపారు.  
    
84 శాతం మంది దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారు.  87 శాతం మంది బాగా పొదుపు చేసి త్వరగా రిటైర్​ కావాలని కోరుకుంటున్నారు. ఇది  సర్వే చేసిన మెట్రో నగరాల్లోకెల్లా అత్యధికం. 87 శాతం మంది ఒకేసారి డబ్బు చెల్లించే లేదా నెలవారీ ఆదాయం అందించే పొదుపు పథకాల్లో చేరతామని తెలియజేశారని ఐసీఏ రిపోర్ట్​ వెల్లడించింది. 

జీవిత బీమాను కేవలం పన్ను ఆదా సాధనంగా కాకుండా, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే మార్గంగా చూడాలి.  జీవిత బీమాను రక్షణ, పదవీ విరమణ, పిల్లల భవిష్యత్తు అనే ప్రాధాన్యత క్రమంలో చూసేలా మార్పు తీసుకురావాలి. చాలా కుటుంబాలు తమ పాలసీ లిమిట్స్​ సరిపోవని కరోనా సమయంలో గుర్తించాయి.  పాలసీదారులు తమ బీమా కవరేజీని సమీక్షించుకోవాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బీమా వ్యాప్తిని పెంచడానికి బ్యాంకుల ఏజెంట్లను  ఉపయోగించుకుంటున్నాం.  తెలంగాణలో కొత్త జీవిత బీమా ప్రీమియాలు జాతీయ మొత్తంలో దాదాపు 7 శాతం ఉన్నాయి. సుమారు 2 కోట్ల మంది వివిధ గ్రామీణ, కమ్యూనిటీ బీమా పథకాల కింద కవర్ అయ్యారు. మనదేశంలో జీవిత బీమా వ్యాప్తి తక్కువగా ఉంది. దాదాపు 90 శాతం  ప్రొటెక్షన్ గ్యాప్  ఉంది.- ఐఏసీ కో– చైర్మన్​ వెంకటాచలం

దేశవ్యాప్త పరిస్థితి ఇలా...

ఇండియాలో బీమా వ్యాప్తి (మొత్తం ప్రీమియం జీడీపీలో శాతం) 2021–22లో 4.2 శాతంగా ఉంది. ఇది ప్రపంచ సగటు 7 శాతం కంటే తక్కువగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 3.2 శాతానికి తగ్గింది. జీవిత బీమా రక్షణ అంతరం (బీమా అవసరం, ఉన్న బీమా మధ్య తేడా) 87 శాతంకు పెరిగిందని 2023 రిపోర్ట్​ పేర్కొంది. 18–35 సంవత్సరాల మధ్య వయస్కులలో ఇది 90 శాతానికి పైగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 4 శాతం, 2024లో 3.7 శాతం ఉన్న బీమా వ్యాప్తి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.2 శాతానికి తగ్గింది. అధిక బీమా ప్రీమియం, అవగాహన లోపం కారణంగా బీమా వ్యాప్తి తక్కువగా ఉంది.