
- రాజ్యాంగం ప్రమాదంలో ఉందనే..
జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని బలపరిచాం బీఆర్‌ఎస్ ఎంపీలు - యూరియా సరఫరా చేసేది ఎవరో కేటీఆర్‌కు తెలియదా ? ... మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, వెలుగు : ‘కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాజ్యాంగం ప్రమాదంలో పడింది, రాజ్యాంగ పరిరక్షణ కోసమే న్యాయ కోవిదుడైన తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బలపరిచాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇది కాంగ్రెస్ నిర్ణయం కాదు.. ఇండియా కూటమి ఎంపిక అని స్పష్టం చేశారు.
ఇన్నాళ్లు గోడ మీద పిల్లిలా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీజేపీ వెంట వెళ్తారో ? తెలంగాణ బిడ్డకు మద్దతు ఇస్తారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి గురువారం కరీంనగర్ డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ యూరియా ఎవరు ఇస్తే.. వారికే ఓటు వేస్తామని కేటీఆర్ చెబుతున్నారు..
పదేండ్లు మంత్రిగా పనిచేసిన ఆయనకు యూరియా ఎవరు ఇస్తారో తెలియదా అని ఎద్దేవా చేశారు. యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపుతోందన్నారు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద బీఆర్‌ఎస్ లీడర్లు రైతులను భయపెడుతున్నారని, చెప్పులను వారే లైన్‌లో పెట్టి ఫొటోలు తీసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కొందరు వ్యక్తులు కావాలనే కృ-త్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. యూరియా సరఫరా చేయాలని తమ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. కరీంనగర్‌లోనూ రైతులు ఆందోళన చేస్తున్నారని... అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్... బాధ్యత తీసుకుని ఎరువులు సరఫరా అయ్యేలా చూడాలన్నారు.
కాళేశ్వరానికి సంబంధించి రెండో టీఎంసీ నీరే రాలేదని.. కానీ మూడో టీఎంసీ పేరిట కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ శాతవాహన యూనివర్సిటీని నిర్వీర్యం చేసిందని, తాము అధికారంలోకి వచ్చాకే యూనివర్సిటీకి ప్రత్యేక నిధులు కేటాయించామని, లా కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ తీసుకొచ్చామని గుర్తు చేశారు.