
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివారావు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలన్నీ మీడియా సృష్టే అని ఆయన చెప్పారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా పార్టీ మారతున్నట్లు ప్రచారం జరుగుతూనే ఉందని, వార్తలు నిజం కాదని అన్నారు గంటా. ఏదైనా నిర్ణయం తీసుకుంటే తానే చెబుతానన్నారు. తనను నిరంతరం వార్తల్లో ఉంచుతున్న మీడియాకు కృతజ్ఞతలు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఆ విషయం పవన్‌నే అడగాలి
ఫంక్షన్లలో ఇతర పార్టీల వ్యక్తులను కలుస్తుంటామని, వాటిని రాజకీయాలతో ముడిపెట్టలేమని చెప్పారు మాజీ మంత్రి గంటా. తాను నరేంద్ర మోదీని కలిసి ఫోటో తీసుకున్నది నిజమేనని, అయితే అది ఆయన గుజరాత్ సీఎంగా, తాను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పటిదని చెప్పారు. ఆ ఫొటోను ఇప్పుడు వైరల్ చేస్తూ పార్టీ మారుతున్నానని ప్రచారం చేస్తున్నారని అన్నారు. అమిత్ షా గురించి పవన్ చేసిన కామెంట్స్‌లో ఉద్దేశం బీజేపీ మంచిదనో, లేక బీజేపీకి దగ్గరవ్వాలన్న కోరికతోనో ఆయననే అడగాలని చెప్పారపు గంటా.