ప్రపంచంలో గ్రామీణ, పట్టణ జనాభాలో వ్యత్యాసాలు క్రమంగా పెరుగుతున్నాయి, 1960లో మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 60 శాతానికి పైగా ఉండేది. కానీ 2007 తర్వాత పట్టణ ప్రాంతాల్లో నివసించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నేడు ప్రపంచ జనాభాలో సుమారుగా 55 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 68 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నారు. ఈవిధంగా పట్టణ జనాభా పెరగడం వల్ల ఆహార పదార్థాల డిమాండ్, ఉత్పత్తిలో వ్యత్యాసాలు ఏర్పడనున్నాయి. ఈ పరివర్తన కాలంలో సరసమైన, సురక్షితమైన, నాణ్యత గల ఆహార ఉత్పత్తులు, మధ్య తరగతి ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయన్న విషయాన్ని గమనించాలి. సమాజం ఎంత అభివృద్ధి చెందినా ప్రజలకు సరైన పోషకాహారం అందించకపోతే సాంకేతిక అభివృద్ధికి అర్థంలేదు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం లభించడం వల్ల ప్రజలకు పనిచేసే శక్తి సామర్ధ్యాలు పెరిగి ఒక దృఢమైన సమాజం ఏర్పడుతుంది. ఒకవైపు ఆహార ధరలు పెరగడం మరోవైపు ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో పోషక ఆహారం పొందడం అనేది పేద ప్రజలకు సమస్యగా మారింది.
ఆహార, వ్యవసాయ సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2024లో సుమారు 31.9 శాతం మంది ప్రజలు (2.60 బిలియన్లు) ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమకూర్చుకోలేకపోయారు. మన దేశంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమకూర్చుకోలేని వారు సుమారుగా 40 శాతం (58.65 కోట్లు జనాభా) ఉన్నారు. భౌగోళిక ఆహార ఉత్పత్తి, నివసించే ప్రాంతాలు, ప్రజల్లో ఆదాయం స్థితులు కూడా ఆహారం తీసుకునే విధానాలపై ఆధారపడతాయి. జాతీయ గణాంకాల కార్యాలయం ‘భారత దేశంలో పోషకాహార వినియోగం-2025’ నివేదిక ప్రకారం 2023–-24 కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సగటు తలసరి దైనందిన వినియోగం వరుసగా 2212, 2240 క్యాలరీలు. అందులో సగటు క్యాలరీల వినియోగంలో తృణధాన్యాల వాటా గ్రామీణ భారతదేశంలో సుమారు 48 శాతంకాగా, పట్టణ భారతదేశంలో ఇది దాదాపు 40.6 శాతంగా ఉంది. తృణధాన్యాల ద్వారా లభించే ప్రోటీన్ వాటా గ్రామీణ ప్రాంతాల్లో 45.9 శాతం, పట్టణ ప్రాంతాల్లో 38.7 శాతంగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రజల ఆహారంపై ఖర్చులు చేస్తే, భారతదేశ గృహ వినియోగ వ్యయ సర్వే గణాంకాల ప్రకారం, సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం గ్రామీణ ప్రాంతాలకు రూ. 4,122 గానూ, పట్టణ ప్రాంతాలకు రూ.6,996గానూ నమోదైంది.
సాగు–ఆహార సమతుల్యం
నేటికీ భారతదేశం పోషకాహార లోపం ఎదుర్కొంటూనే ఉంది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలోని అన్ని వయసులవారిలోనూ సూక్ష్మ పోషకాల లోపాలు విస్తృతంగా ఉన్నాయని వెల్లడించింది. నాణ్యమైన ఆహారం అంటే మానవ శరీరానికి కావలసిన శక్తి అందించగల అన్ని రకాల పోషకాలు కలిగి ఉండడం. మనం తీసుకునే ఆహారంలో పోషకాల వైవిధ్యత లేనందున భారతదేశంలో పోషకాహార భద్రత ఒక కీలకమైన సవాలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు పోషకాహార భద్రతనిచ్చి ఆరోగ్యాన్ని కాపాడగలిగేది మాత్రం దేశ రైతాంగం మాత్రమే. ప్రజల ఆరోగ్యం రైతుల చేతుల్లోనే ఉంది. రైతుల కృషి వల్ల దేశంలో చాలావరకు ఆకలి చావులు లేవు. అంతేకాకుండా దేశ సాగు గతంలో ఎన్నడూ లేనివిధంగా పురోగతి చెంది దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డుస్థాయికి చేరింది. మన దేశంలో 2024–-25లో సుమారుగా 357.73 మిలియన్ మెట్రిక్ టన్నుల రికార్డు స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించింది. అయితే సాగులో సాధించిన ఈ పురోగతి దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా సరసమైన, సురక్షితమైన, నాణ్యత గల ఆహార ఉత్పత్తులను
అందించడంలో ఎంతవరకు ఫలించింది అన్నది నేటికీ ప్రశ్నార్ధకంగా ఉంది.
మారిన పంటలు పండించే విధానం
దేశ ప్రజల పోషక ఆహార భద్రత పంటలు పండించే విధానంతో ముడిపడి ఉంది. మన దేశంలో ప్రాచీన సాగు ప్రజల ఆహార అవసరాలకు అనుగుణంగా ఉండేది. కానీ, నేడు దేశంలో పంటలు పండించే విధానం క్రమంగా మారింది. ప్రధానంగా హరిత విప్లవం వల్ల 1960 తర్వాత సాగులో సాంకేతిక పురోగతి, అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలు వినియోగించడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. కానీ, ఆహార ధాన్యాల ఉత్పత్తి కొన్ని రకాల పంటలకు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. దీనివల్ల ఆహార పదార్ధాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ ప్రజలకు పోషకారం లభించడంలో విఫలమయ్యాం. ఒకే రకమైన ఆహార ధాన్యాల ఉత్పత్తి వల్ల ప్రజకు తీసుకునే ఆహారంలో పోషకాల వైవిధ్యత లోపించి ప్రజల ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమైతుంది. భారతదేశంలో అసమతుల్య ఆహారం అనేది గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, ఊబకాయంతో ముడిపడి ఉన్న ఇతర అనారోగ్యాలతో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారకాలలో ఒకటిగా మారింది. ఈ తరుణంలో దేశ ప్రజల ఆరోగ్య రీత్యా సాగును ప్రజల అవసరాలకు అనుగుణంగా మళ్లించాల్సిన అవసరం ఉంది.
దేశీయ విత్తనాలు సుస్థిర ఆహార వ్యవస్థలకు పునాది
ఆర్థిక పరిమితులు, స్థానిక వ్యవసాయ వైవిధ్యం లేకపోవడం, సరిపడా శీతల గిడ్డంగులు లేకపోవడం కారణంగా గ్రామీణ ప్రజలు బియ్యం లేదా గోధుమ వంటి ఒకే ప్రధాన ఆహారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కావున పంటల వైవిధ్యం ద్వారా ఆహార వైవిధ్యీకరణ ఎదుర్కోవడానికి ఒక ప్రధానమైన తక్కువ ఖర్చుతో కూడిన వ్యూహాన్ని అనుసరించాలి. చిన్న, సన్నకారు రైతులను సైతం, తమ భూమిలోని చిన్న భాగాలను వరి, గోధుమ సాగు నుంచి పండ్లు, కూరగాయలు, ఇతర సంప్రదాయ పంటలు వేసే దిశగా మళ్లించడం ఎంతో అవసరం ఉంది. సాగులో దేశీయ విత్తనాలు సుస్థిర ఆహార వ్యవస్థలకు పునాది. అవి జన్యుపరంగా వైవిధ్యభరితంగా ఉంటాయి, స్థానిక వాతావరణాలకు బాగా అనుకూలంగా ఉంటాయి. వాటికి తక్కువ రసాయన ఎరువులు అవసరమవుతాయి. ఈ దేశీయ రకాలు దీర్ఘకాలికంగా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఆహార భద్రతను బలోపేతం చేస్తాయి. పోషకపరంగా, వాణిజ్య పంటలతో పోలిస్తే ఇవి ఉన్నతమైన ప్రోటీన్లు, సూక్ష్మపోషకాలు, ఆహార వైవిధ్యాన్ని అందిస్తాయి. గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ విధానాలు పంట దిగుబడి పెంచేవిధంగా ఉండడం వల్ల మన రైతులు అధిక దిగుబడినిచ్చే వంగడాలను సాగుచేయడం పెరిగింది. దానివల్ల మన దేశంలో దాదాపుగా 75 శాతం కంటే ఎక్కువ దేశీయ రకాలు అంతరించిపోయాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
దేశీయ వంగడాలతో పోషకాహారం
ఈ తరుణంలో దేశీయ వంగడాలను పరిరక్షించి వాటి సాగును పోత్సహిస్తే ప్రజలకు పోషక ఆహారం లభిస్తుంది. పోషకాహార భద్రత కల్పించే ప్రజా ఆహార ధాన్యాల పంపిణీ వ్యవస్థ ప్రజలకు సమతుల్య ఆహారం అందించడంలో ఎంతో కీలకం. మన దేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం- 2013 ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)అఖిల భారతస్థాయిలో అమలవుతోంది. గ్రామీణ జనాభాలో 75 శాతం వరకు, పట్టణ జనాభాలో 50 శాతం వరకు అనగా సుమారుగా 81.35 కోట్ల మందికి ఆహార ధాన్యాల పంపిణీ అవుతోంది. దేశ ప్రజల ఆరోగ్యం పంపిణీ చేసే ఆహార ధాన్యాలపై ఆధారపడుతుంది. కావున ప్రజా పంపిణీ వ్యవస్థ కేవలం క్యాలరీల పంపిణీతోపాటు పోషకాహార భద్రత వైపు మారడం అవసరం. ‘భవిష్యత్ ఆహారం’ అనే భావన కేవలం ఒకే ఒక వస్తువుకు సంబంధించినది కాదు. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, సుస్థిరత అవసరాలకు అనుగుణంగా మనం ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేస్తాం, శుద్ధి చేస్తాం మరియు వినియోగిస్తామనే దానిపై ప్రజారోగ్యం ఆధారపడుతుంది. మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయాలు, ప్రయోగశాలలో పెంచిన మాంసం, కీటకాలు, శైవలాలు వంటి కొత్త ప్రోటీన్ వనరులతోపాటు, చిరుధాన్యాలు, పోషకాహారాన్ని మెరుగుపరిచే బయోఫోర్టిఫైడ్ ఆహారాలు ఉండబోతున్నాయి. కావున ఇలాంటి నూతన ఆహార పదార్దాలను పేద ప్రజలకు చేకూర్చడానికి ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించగలిగితే పేదలు భవిష్యత్తులో సమతుల్య ఆహారాన్ని పొందగలుగుతారు. సమతుల్య పోషకాహారం అనేది నిరుపేదలకు అందని ద్రాక్షగా మారకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
- డా. రేపల్లె నాగన్న
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
