- మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, వెలుగు : ‘సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారిత, సామాజిక భద్రతకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా కందిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని, దూరదృష్టితో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రైతులకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కుటుంబ సంక్షేమానికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అవసరమని, ప్రతిఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా నైపుణ్య ఆధారిత విద్యను ప్రోత్సహిస్తున్నామన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధితో జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. అంతకుముందు వివిధ స్టాళ్లను సందర్శించి, వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రదర్శించిన ఆయిల్‌పామ్ మొక్కలు, డ్రోన్ సాంకేతికతను పరిశీలించారు. అనంతరం మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులను టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్‌రెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏంఏ.ఫహీమ్, కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, అడిషనల్ కలెక్టర్ పాండు పాల్గొన్నారు.
