- మృతుల ఫ్యామిలీకి రూ. 4 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
- పోలీస్ ఫిర్యాదు, పోస్ట్‌మార్టం రిపోర్ట్ తప్పనిసరి
- రికార్డు స్థాయిలో ఎండలు.. పిట్టల్లా రాలుతున్న జనాలు
- రాష్ట్రవ్యాప్తంగా రోజూ పదుల సంఖ్యలో వడదెబ్బ మరణాలు
- బయటకు రాని మరికొన్ని కేసులు
వరంగల్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో.. జనాలు వడదెబ్బ తో పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ కారణాంగా చనిపోయిన వారి ఫ్యామిలీకి ప్రభుత్వం రూ. 4 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. గతంలో రూ. 50 వేలుగా ఉన్న ఈ పరిహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెంచింది. కానీ ఈ ఆర్థికసాయం పొందడానికి పాటించాల్సిన నిబంధనలు చాలా మందికి తెలియకపోవడంతో పరిహారానికి దూరం అవుతున్నారు.
46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
రాష్ట్రంలో గతానికి భిన్నంగా ఈ సారి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో రామగుండం, కొత్తగూడెం వంటి సింగరేణి ఏరియాలకు మాత్రమే పరిమితం అయ్యే వేడి.. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కనిపిస్తోంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుండడంతో 25 జిల్లాలను రెడ్‌జోన్‌లోకి చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 మండలాల్లో హీట్‌వేవ్స్ నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే గతంలో ఎన్నడూ లేని టెంపరేచర్లు ఇప్పుడు రికార్డు అవుతున్నాయి.. దీంతో చాలా మంది వడదెబ్బకు తో చనిపోతున్నారు. రాష్ట్రవ్యాపంగా ప్రతి రోజు పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
బయటకు రాని మరణాలు ఎన్నో ఉంటున్నాయి. పరిహారం రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంపు
కూలీలు, రైతులు, శ్రామికులు, డ్రైవర్లే ఎక్కువగా వడదెబ్బతో చనిపోతున్నారు. వడదెబ్బ మృతుల ఫ్యామిలీకి గతంలో ప్రభుత్వం నుంచి రూ. 50 వేల చొప్పున ఆర్థికసాయం అందింది. రాష్ట్రంలో రేవంత్‍రెడ్డి ప్రభుత్వం వచ్చాక.. గతేడాది ఎండాకాలానికి ముందు ఈ ఆర్థికసాయాన్ని రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం, లేదంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 నుంచి 7 డిగ్రీల టెంపరేచర్లు, వడగాల్పులు నమోదైన సమయాల్లో చనిపోతే వడదెబ్బ మరణాలుగా గుర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా చనిపోయిన వారి ఫ్యామిలీకి ఎస్‍డీఆర్‍ఎఫ్ (రాష్ట్ర ప్రభుత్వ విపత్తునిధి) ద్వారా ఆర్థికసాయం అందజేస్తారు.
మూడు శాఖల పరిధిలో విచారణ
వడదెబ్బ మృతుల నిర్ధారణ ప్రధానంగా మూడు శాఖల పరిధిలో జరుగుతుంది. ప్రభుత్వ వైద్యాధికారి, స్థానిక పోలీసస్టేషన్ ఆఫీసర్, స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు వడదెబ్బ మరణాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. మండల స్థాయిలో ఈ మూడు శాఖల ఆఫీసర్లు.. కేసు నమోదుతో విచారణ చేపట్టి వడదెబ్బ మరణాన్ని జిల్లా ఆఫీసర్లకు పంపించాలి. వీరు అందించే రిపోర్ట్‌ను ఆధారంగా కలెక్టర్ వడదెబ్బ మరణంగా ధ్రువీకరించి రికార్డుల్లో నమోదు చేస్తారు.
పోస్ట్‌మార్ట్ రిపోర్ట్ కంపల్సరీ
వడదెబ్బ కారణంగానే చనిపోయినట్లు భావిస్తే 24 గంటల్లోగా గవర్నమెంట్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడి ఫోరెన్సిక్ వైద్యులు మరణానికి వడదెబ్బే కారణమని పోస్ట్‌మార్టం రిపోర్టులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన తెలియక చాలా మంది వడదెబ్బ పరిహారం కోల్పోతున్నారు. పోస్ట్‌మార్టంతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయిచడంతో పాటు స్థానిక రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
తర్వాత పోస్ట్‌మార్టం రిపోర్టు, పోలీస్ స్టేషన్‌లో ఫైనల్ రిపోర్ట్ కాపీ, చనిపోయిన వ్యక్తి గుర్తింపు కార్డు, నామినీకి సంబంధించిన గుర్తింపు పత్రాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను తహసీల్దార్ ఆపీస్‌లో ఇచ్చి ఆర్థికసాయం కోసం అప్లై చేసుకోవాలి. అనంతరం రెవెన్యూ ఆఫీసర్లు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, కలెక్టర్‌కు ఫైనల్ రిపోర్ట్ అందజేయాలి. అనంతరం పూర్తి స్థాయి విచారణ తర్వాత ఆర్థికసాయం మంజూరు అవుతుంది. కానీ వడదెబ్బ మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించే రూల్స్ తెలియక చాలా వడదెబ్బ బాధిత కుటుంబాలు ఆర్థికసాయం అందుకోలేక పోతున్నారు.
