ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా ఉన్న దేశంలో యువత.. దారి, తెన్నూ లేని అయోమయంలో అలమటిస్తోంది. రాజకీయ దృక్పథం లేకుండా నేటి యువతరం గాలివాటు కదలికలతో, అనిశ్చితిలో నిత్యం కొట్టుమిట్టాడుతోంది. వారికి స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వగల నాయకత్వలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో దినదినం విశ్వసనీయత కోల్పోతున్న రాజకీయ వ్యవస్థ వారికి ఏ కొత్త భరోసా కల్పించలేకపోతోంది. పైగా, ఈ అవ్యవస్థే వారిని ప్రత్యామ్నాయాల వైపు చూసేలా పురిగొల్పుతోంది. పునాదిలో గట్టి సామాజిక అవగాహన లేని ఆధునిక భావజాలంతో ఎక్కడ నుంచి, ఏ ఆశాకిరణం తళుక్కుమన్నా అటు పరుగులు తీసే ఊగిసలాట వారిది! ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) సోషల్ మీడియా పొంగు ఇందుకొక ఉదాహరణ. పుట్టడంతోనే ఈతరం ‘క్యార్’మనకుండా ‘కెరీర్’ అంటున్నారనే వ్యంగ్య వ్యాఖ్యల్ని నిజం చేస్తూ, చిన్నతనం నుంచీ కెరీర్ దృష్టితో ఎదిగే యువతలో సామాజిక దృక్పథమే కొరవడుతోంది. బలమైన సిద్ధాంత భూమిక, విలువల రాజకీయాలు సన్నగిల్లిన సమకాలీన సమాజంలో ఇంతటి బలమైన యువశక్తి గమనం ఎటు? గమ్యం ఏంటి? ఇవీ, చర్చరేపుతున్న ప్రశ్నలు!
యువతను దేశ బలమైన శక్తిగా మలచుకుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడంలో మన రాజకీయ వ్యవస్థేకాక న్యాయవ్యవస్థ కూడా విఫలమౌతోంది. నిరుద్యోగ యువతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి రావాల్సిన సందేశం స్థాయిలో లేవు. ప్రజాస్వామ్యంలో పాలనా వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తికి, -చట్టాలకు లోబడి పనిచేసేలా భరోసా కల్పించడం దేశ అత్యున్నత న్యాయస్థానం విధి, బాధ్యత! వ్యవస్థల పనితీరు అపసవ్యంగా ఉన్నపుడు ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందనే రాజ్యాంగపు మౌలిక విధానాలకు, సహజ న్యాయ సూత్రాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఆ వ్యాఖ్యలు సహజంగానే యువతలో అసహనం రేకెత్తించాయి. దేశంలో యువ జనాభా అధికం కనుక యువశక్తిని ఓటుబ్యాంకుగా మలచుకోవాలనే సంకుచిత భావనే రాజకీయ పార్టీలది. యువశక్తిని దేశ సంపదగా పరిగణించే సదాలోచన, దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేర్చే కార్యాచరణ పాలకుల్లో ఉన్నట్టు కనిపించదు. యువత ఉద్యోగ, -ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ప్రభుత్వాల బాధ్యత. ఇది రాజ్యాంగం నిర్దేశించిన కర్తవ్యం. యువశక్తిని దేశ సంపదగా మార్చే ఆచరణాత్మక, సామాజిక- ఆర్థిక ఎజెండా కావాలి తప్ప.. పండుగ పూట యువతతో కలిసి ప్రధాని మోదీ పతంగులు ఎగరవేసేందుకు చూపే ఉత్సాహం, దేశ జట్టు క్రికెట్ కప్ గెలిచిన సంబరంలో భాగమౌతూ సోనియాగాంధీ జెండాతో వీధుల్లోకి రావడానికి చూపిన ఆసక్తి, ప్రపంచ మేటి ఫుట్‌బాలర్ మెస్సీ ఆట చూసేందుకు విపక్షనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు తరలి రావడం.. వీటినెవరూ తప్పుబట్టరు. కానీ, వాటికే పరిమితం కావడాన్ని హర్షించరు.
వివరణలు కాదు.. సవరణలు కావాలి
మే 15నాడు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విచారణలో దేశంలోని నిరుద్యోగ యువతను ‘బొద్ధింకలు’(కాక్రోచెస్)తో పోల్చారు. అక్కడితో ఆగకుండా ఉద్యోగాలు లేక వీళ్లు పరాన్నబుక్కులుగా మారి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారని, ఆర్టీఐ యాక్టివిస్ట్లుగా, జర్నలిస్టులుగా మారుతున్నారనీ అన్నారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ రియాక్షన్‌ను ఊహించని న్యాయమూర్తి తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, ఫేక్ డిగ్రీలు ఉన్న వాళ్లను ఉద్దేశించి అన్నానని వివరణ ఇచ్చారు. ఇది ఇంకో లాఫింగ్ స్టాక్‌కు దారితీసింది. ఆయన తన వ్యాఖ్యలు కేవలం ‘నకిలీ డిగ్రీలు’ ఉన్నవారిని ఉద్దేశించినవేనని, అందరిని ఉద్దేశించి అన్నవి కావని తర్వాత వివరణ ఇచ్చినా, అప్పటికే యూత్ ఈ ఆన్లైన్ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. మేం బొద్దింక లమే, తప్పకుండా ఈ కుళ్ళిన వ్యవస్థలను ప్రశ్నిస్తాం. ఇది ప్రజాస్వామ్యం మాకు ఇచ్చిన హక్కు అని పెద్దసంఖ్యలో యువత స్పందించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలకు దీటుగా వేలల్లో వెబ్‌సైట్స్, లక్షల్లో మీమ్స్, రీల్స్, వీడియోలు తయారయ్యాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతోపాటు సంప్రదాయ మీడియాపైన కూడా విశ్వాసం సడలిన యువత అసహనమే ఇందులో కనిపిస్తోంది. బీజేపీని నేరుగా ఎదుర్కోలేని రాజకీయ ప్రత్యర్థుల కుట్ర, పన్నాగం అని సీజేపీని నిర్ద్వంద్వంగా ఖండించేవారున్నారు. లోగడ అన్నాహజారే నేతృత్వంలో వచ్చిన లోక్‌పాల్, జన్‌పాల్ ఆందోళనలు, అవి చివరకు ‘ఆప్’ రాజకీయ పార్టీగా మారడం లాంటిదే ఇది కూడా అని వారు ఉదహరిస్తున్నారు. ‘యువత ఆవేశపు ట్రెండ్‌లాగే నాలుగు రోజులుండి, తుస్సుమనేదే’ అని వారు విశ్లేషిస్తున్నారు.
ఎవరెటున్నా....!
సిద్ధాంతరీత్యా ఎవరు ఎటున్నా... యువతలో పోగుపడుతున్న భావజాలం గురించి ఆలోచించాలి. దానికి మూలాలేంటి? రాగల పరిణామాలేంటి? అన్నవే
ప్రశ్నలు! జనంలో ఒక భావం తలెత్తి, వైరల్ అవుతూ అత్యధికుల దృష్టిని ఆకర్షిస్తోందంటే వెనువెంటనే వాదోపవాదనలు మొదలవుతాయి. ఒక భావం పుట్టి, ఆ ప్రచారం పాలకపక్షానికి వ్యతిరేకంగా వెళుతోందంటే, దాన్ని విమర్శిస్తూ పాలకపక్ష అనుకూల వాదులు ఒక ప్రతివాదన (కౌంటర్ న్యారెటివ్) అభివృద్ధి చేస్తారు. దాన్ని ప్రజాక్షేత్రంలోకి వదులుతారు. సామాజిక మాధ్యమాలే మళ్లీ ఇక్కడ వేదికలవుతాయి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసి, ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్
రిలేషన్స్ చదువుతున్న అభిజీత్ దీప్కే ఏకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) అనే రాజకీయ పార్టీ పెట్టాడు. దానికి ఊహించలేనంత రెస్పాన్స్ వచ్చింది. పార్టీలో సభ్యత్వం ఇవ్వమని ఒక్కరోజే 46,000 మంది నుంచి రిక్వెస్ట్ లు వచ్చాయి. ఆర్టీఐ యాక్టివిస్ట్ లు, విద్యావేత్తలు, స్టూడెంట్స్ నుంచి బోలెడు విజ్ఞప్తులు వస్తున్నాయి. వెనక్కు తగ్గొద్దని, ఇప్పటికీ ఏ పార్టీతోనూ చదువుకున్నవాళ్ళు, యువత రిలేట్ కాలేకపోతున్నారని గుర్తు చేస్తూ చాలా లెటర్స్ వస్తున్నాయి.
సర్వర్ డౌన్ అయ్యేంత డిమాండ్
సీజేపీ అప్లికేషన్ నింపేందుకు పెరిగిన ఒత్తిడితో సర్వర్ డౌన్ అయ్యేంత డిమాండ్ ఏర్పడటమే నిదర్శనం. అతి తక్కువ సమయంలోనే ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్లను దాటేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన, అధికారిక బీజేపీ ఖాతా కంటే ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం బీజేపీకి 9 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే, ఆర్టికల్ రాసే సమయానికి సీజేపీకి 20 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదొక వ్యంగ్య ఉద్యమం (సెటైరికల్ మూమెంట్). నిరుద్యోగులు, సోమరిపోతులు, వృత్తిపరంగా విమర్శలు (ర్యాంట్) చేయగలిగే సామర్థ్యం ఉన్నవారు ఇందులో సభ్యులనే అభిప్రాయం కూడా ఏర్పడింది. అఖిలేష్ యాదవ్, మహువా మోయిత్రా వంటి విపక్ష నేతలు దీనిని సమర్థించగా, ఇది కేవలం విపక్షాలు ప్లాన్ చేసిన ‘డిజిటల్ థియేటర్’ అని బీజేపీ కొట్టిపారేస్తోంది. సీజేపీ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాను భారతదేశంలో చట్టపరమైన డిమాండ్ మేరకు నిలిపివేయడం (విత్‌హెల్డ్) అనేది డిజిటల్ స్వేచ్ఛపై దాడిగా విమర్శకు దారితీసింది. దీన్ని వ్యతిరేకిస్తున్న వారు ‘యాంటీ కాక్రోచ్’ పేరిట కౌంటర్ ప్రచారం ముమ్మరం చేశారు. సీజేపీకి ఉన్న ఫాలోవర్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి ఇతర దేశాల వాళ్లే తప్ప భారతీయులు పదిశాతం కూడా లేరనే ప్రచారాన్ని వారు పెంచారు.
మార్గదర్శకత్వం కావాలి
భారతదేశంలో దాదాపు 50% జనాభా 30 ఏళ్లలోపువారే. కానీ 11% మంది మాత్రమే రాజకీయ పార్టీల్లో సభ్యులుగా ఉన్నారు. సంప్రదాయ రాజకీయాలపై విరక్తి చెందిన -జెన్ జీ తమదైన భాషలో నిరసనను తెలపడానికి ఈ వేదికను బలంగా వాడుకుంటోంది. ఇందులో ఏ విషయంపైనా లోతైన అవగాహన లేకుండా, ‘వాట్సాప్ యూనివర్సిటీ’లాంటి సోషల్ మీడియా పంచే పరిమిత జ్ఞానంతోనే అభిప్రాయాలు ఏర్పరచుకొని, ఉద్రేకానికి -ఉద్విగ్నతకు గురయ్యేవారే ఎక్కువ! సీజేపీ బొద్దింకను ఎంచుకోవడానికి కారణం.. కఠిన పరిస్థితుల్లో కూడా జీవించగల దాని మొండితనం యువత తమ పరిస్థితికి అద్దం పడుతున్నట్లు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు సీజే యువతను బొద్దింకలతో పోల్చిన నెగెటివ్ భావనని వారు పాజిటివ్ దృక్పథంతో అనువర్తించి, ప్రచారంలో పెడుతున్నారు. ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ దళపతి గెలుపు యువతకు కొత్త స్ఫూర్తిని ఇచ్చి ఉంటుంది. టీవీకే విజయం వెనుక, జెన్ జీ తరం శక్తియుక్తుల కృషి ఉంది. వ్యంగ్యం ద్వారా పుట్టిన ఉద్యమాలు రాజకీయాల్లో కొత్తేమీ కాదు. మన దేశంలో ‘తుగ్లక్ పార్టీ’ ఓ ప్రయోగమే! ఇటలీలో ‘ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్’ఉదాహరణగా చెప్పవచ్చు. సీజేపీ కూడా మీమ్స్‌కే పరిమితం అవుతుందా, క్షేత్రస్థాయిలో మార్పు తెస్తుందా అనేది వేచి చూడాల్సిందే!
- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
