బహుజన వర్గాలు శతాబ్దాలపాటు విద్యకు దూరమయ్యాయి. అస్పృశ్యత, అంటరానితనం వంటి అమానుష శిక్షలతో వారు సామాజికంగా, విద్యాపరంగానూ వెనుకబడ్డారు. భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మక మార్పుకు దారి తీసింది. ఆర్టికల్ 21A ద్వారా విద్యను హక్కుగా గుర్తించడం, ఆర్టికల్ 46 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ, వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అక్షరాస్యత రేటు అగ్రవర్ణాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఇది చారిత్రక వెనుకబాటుతనానికి ప్రతిబింబం. ఈ వెనుకబాటును సరిచేసే క్రమంలో విద్యాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టడం జరుగుతోంది. ఇందులో భాగంగా విద్యాహక్కు చట్టం, మధ్యాహ్న భోజనం ద్వారా పోషకాహార భద్రతకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గరికపాటి వంటి ప్రవచనకర్త మధ్యాహ్నభోజనం ఎందుకని, గుడ్డు ఎందుకని.. అన్న మాటలు మధ్యాహ్నం భోజనంపై చేసిన వ్యాఖ్యలు బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలను అవమానించేలా ఉన్నాయి.
పౌష్టికాహార లోపంతో అనారోగ్య సమస్యలు
తెలంగాణ రాష్ట్రాన్ని పరిశీలిస్తే దాదాపు 92 శాతం విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. కేవలం 8 శాతం మాత్రమే అగ్రకులాల పిల్లలు వీటిలో విద్యనభ్యసిస్తున్నారు. గరికపాటి మెజార్టీ విద్యార్థులను అవమానించినట్టు కాదా? ఈ విషయం పట్ల అనేక ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. భారతదేశంలో పౌష్టికాహారం లోపం వల్ల కోట్లాది బాలలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిశోధన అనంతరం పిల్లల పౌష్టికార భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి మూడు రోజులు గుడ్డు పెడుతున్నారు. గుడ్డు పౌష్టికాహారం. కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గుడ్డు ఇవ్వడంపై ప్రశ్నిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అవమానించినట్లు మాట్లాడడం నిరుపేదలకు చదువును, ఆహారాన్ని దూరం చేసే ప్రయత్నమా?
ఆహార భద్రత చట్టంలో భాగం
భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకం ఆరంభం స్వాతంత్ర్యానికి ముందే కొన్ని ప్రాంతాలలో కనిపించినా, వ్యవస్థీకృతంగా ఇది తమిళనాడు రాష్ట్రంలో 1960లలో ప్రారంభమైంది. తరువాత ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. 1995 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. 2001 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు వండిన వేడి భోజనం తప్పనిసరి. ఇది హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఈ పథకం 1వ నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు వర్తింపజేశారు. ప్రస్తుతం ఇది పీఎం పోషణ్ పేరిట కొనసాగుతోంది. ఇది ఆహార భద్రత చట్టంలోని భాగం. మధ్యాహ్న భోజనం అమలు ద్వారా పేద కుటుంబాల పిల్లలు పాఠశాలకు రావడానికి ప్రోత్సాహం లభించింది. హాజరు నమోదు శాతం పెరిగింది. అక్షరాస్యత, విద్యాభివృద్ధికి బాటలుపడ్డాయి. పిల్లలలో పోషకాహార లోపం తగ్గింది. తరగతి గది ఆకలిని తగ్గించింది. వివిధ కులాలు, వర్గాల పిల్లలు కలిసి భోజనం చేయడం ద్వారా సమానత్వ భావన పెరిగింది. ఈ పథకం పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వంట కార్మికులుగా మహిళలకు ఉపాధి అవకాశాలు కలిగిస్తుంది. నేడు మధ్యాహ్న భోజన పథకం కేవలం సంక్షేమ కార్యక్రమంగా కాకుండా చట్టపరమైన హక్కుగా గుర్తింపుపొందింది. విద్యాహక్కు చట్టం ప్రకారం తప్పనిసరి విద్యలో భాగంగా 6 నుంచి14 సంవత్సరాల పిల్లలకు పోషకాహారం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. జాతీయ ఆహార భద్రతా చట్టం- 2013 పాఠశాల విద్యార్థులకు పోషకాహారం భద్రతను కల్పిస్తుంది.
గరికపాటి మాటలు వెనక్కితీసుకోవాలి
జీవించే హక్కు భారత రాజ్యాంగంలోని అత్యున్నతమైన హక్కు. ఇందులో భాగంగానే అందరికీ విద్య వంటి మౌలిక హక్కులో మధ్యాహ్నం భోజనం అమలవుతోంది. ఇలాంటి పథకం అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం నడుస్తోంది. ఈ క్రమంలో గరికపాటి మాటలు సమాజాన్ని తప్పుదోవ పట్టించేవిధంగా ఉన్నాయి. మంచి చదువు గురించి మాట్లాడడం తప్పుకాదు. కానీ, పిల్లలు అన్నం కోసమే బడికి వస్తున్నట్లు, వారికి కోడిగుడ్డు ఇవ్వడం పట్ల హేళన చేయడం సరికాదు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మేధావులు, ఉపాధ్యాయ , విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం ముఖ్యమని మన సంస్కృతి, ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ‘ఆకలి తీర్చినపుడే విద్య పుష్టిగా పెరుగుతుంది’ ఈ సూత్రంతో మధ్యాహ్న భోజన పథకాన్ని సమగ్రంగా బలోపేతం చేయాలి. కానీ దాన్ని నిర్వీర్యం చేసేవిధంగా మాట్లాడటం ఆక్షేపణీయం. మధ్యాహ్న భోజనం వంటి ఉన్నతమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు విస్తరింప చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది. కానీ ఆ ప్రవచనకర్త మాటలు రాజ్యాంగాన్ని, చట్టాన్ని కూడా అవమానించినట్లుగా ఉన్నాయి. కావున ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలి.
- సంపతి రమేష్,
సోషల్ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
