
యాదాద్రి: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తులు త్వరగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ మాదిరిగా యాదగిరి గుట్టలో గరుడ టికెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు.
శనివారం (జూలై 19) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మీ నరసింహా స్వామి భక్తులు త్వరగా స్వామి వారిని దర్శనం చేసుకోవడం కోసం గరుడ టికెట్‌ను తీసుకొస్తామని.. ఈ టికెట్ ధర రూ.5 వేలు ఉంటుందని తెలిపారు. గరుడ టికెట్‌పై ఒక భక్తుడికి ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి స్వామి వారి పవళింపు సేవ వరకు ఏ సమయంలోనైనా సాధారణ భక్తులకు అంతరాయం కలగకుండా దర్శనం కల్పిస్తామని చెప్పారు.
అలాగే ఐదు లడ్డులు, కిలో పులిహోర అందించి అర్చకులతో ఆశీర్వచనం ఇప్పిస్తామన్నారు. అలాగే, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భక్తుల్లో ఆధ్యాత్మికత పెంపొందించడానికి హిందు ధర్మ వ్యాప్తి కోసం త్వరలోనే వైటీడీ పబ్లికేషన్స్ ద్వారా యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రికను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. మాసపత్రిక మొదటగా తెలుగులో తీసుకువస్తామని, రానున్న రోజుల్లో మిగితా భాషలకు విస్తరిస్తామని చెప్పారు.
ALSO READ : మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: మంత్రి వివేక్
యాదగిరిగుట్టలో ప్రతి సంవత్సరం రూ.3 నుంచి 4 కోట్లు విద్యుత్ చార్జీ అవుతున్న నేపధ్యంలో ఆలయంలో గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్‌ని డెవలప్ చేస్తున్నామని తెలిపారు. ఇందుకు నాలుగు మెగా వాట్ల బ్యాటరీ ఎనర్జీ, సోలార్ సిస్టమ్‌ను తీసుకువస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో యాదగిరి టీవీ ఛానల్ పెట్టాలనే ఆలోచలో ఉన్నామని తెలిపారు.