లింగాల, వెలుగు : లింగాల మండల పరిధిలోని సురాపురం గ్రామంలో గురువారం గ్యాస్ సిలిండర్ లీకై మంటలు ఎగిసిపడటంతో తీవ్ర కలకలం రేగింది. ముష్టిపల్లి శివ అనే వ్యక్తి ఇంట్లో కొత్త సిలిండర్ బిగిస్తుండగా వాచర్ సరిగ్గా లేకపోవడంతో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మంటలను ఆర్పే ప్రయత్నంలో ముష్టిపల్లి వెంకటస్వామికి తీవ్ర గాయాలవ్వగా, అతడిని 108 వాహనంలో లింగాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్, ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటికే మంటలతో ఇల్లు బీటలు వారడంతో పాటు వంట సామగ్రి, నిత్యవసర సరుకులు, విలువైన పత్రాలు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
