AI సమ్మిట్ నుంచి బిల్ గేట్స్ ఔట్ : ఎప్టిన్ ఫైల్స్ వివాదంతో పక్కన పెట్టేశారు..!

AI సమ్మిట్ నుంచి బిల్ గేట్స్ ఔట్ : ఎప్టిన్ ఫైల్స్ వివాదంతో పక్కన పెట్టేశారు..!

ప్రపంచ ఐటీ దిగ్గజాలతో దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్ నుంచి బిల్ గేట్స్ ఔట్.. ఆయన ప్రసంగం లేకుండానే సమ్మిట్ జరుగుతుంది. దీనికి కారణం ఎప్టిన్ ఫైల్స్ వివాదమే. ఈ విషయాన్ని గేట్స్ ఫౌండేషన్ అధికారికంగా ప్రకటించింది. బిల్ గేట్స్ స్థానంలో.. కంపెనీ నుంచి ఆయన ప్రతినిధిగా అంకుర్ ఓరా మాట్లాడతారని వెల్లడించింది ఫౌండేషన్. 

AI సమ్మిట్ లో బిల్ గేట్స్ ప్రసంగంపై కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి ముగింపు పలికింది గేట్స్ ఫౌండేషన్. అన్ని జాగ్రత్తలను పరిశీలించిన తర్వాత.. AI సమ్మిట్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని.. బిల్ గేట్స్ తప్పుకున్నారని.. తన ప్రసంగం ఇవ్వరు అని గేట్స్ ఫౌండేషన్ ఓ లెటర్ రిలీజ్ చేసింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడిగా బిల్ గేట్స్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రపంచ ఐటీ సృష్టికర్తల్లో ఆయన ఒకరు. ఈ క్రమంలోనే అమెరికా దేశాన్ని కుదిపేస్తున్న ఎప్టిన్ సెక్స్ కుంభకోణంలో బిల్ గేట్స్ పేరు బయటకు రావటం.. ఆయన ఫొటోలు కనిపించటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నది గేట్స్ ఫౌండేషన్. 

బిల్ గేట్స్ స్థానంలో ఇండియా, ఆఫ్రికా కార్యాలయాల అధ్యక్షుడు అంకుర్ ఓరా ప్రసంగిస్తారని వెల్లడించింది ఫౌండేషన్. ఆరోగ్యం, అభివృద్ధి అనే కీలక లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లటంలో గేట్స్ ఫౌండేషన్ భారతదేశంతో కలిసి పని చేస్తుందని.. ఇందుకు కట్టుబడి ఉందని వివరించింది ఫౌండేషన్. 

ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ లో కీలక వ్యక్తుల ప్రసంగాల లిస్ట్ నుంచి బిల్ గేట్స్ ను తప్పించటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. 19వ తేదీ మధ్యాహ్నం బిల్ గేట్స్ 12 నిమిషాలు ప్రసంగించాల్సి ఉంది. ఇప్పుడు ఆయన స్థానంలో ఓరా మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని గేట్స్ ఫౌండేషన్ అధికారికంగా వెల్లడించటంతో.. వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.