నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు.. ధోనీ అయినా కోహ్లీ అయినా ఒక్కటే: గౌతం గంభీర్

నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు.. ధోనీ అయినా కోహ్లీ అయినా ఒక్కటే: గౌతం గంభీర్

ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ చోటుచేసుకున్న సంగతి అందరికీ విదితమే. మ్యాచ్ సమయంలో కోహ్లీ- నవీన్ ఉల్ హాక్ మధ్య మొదలైన స్లెడ్జింగ్.. గంభీర్ ఎంట్రీతో వివాదస్పదంగా మారింది. సహచర ఆటగాళ్లు కట్టడి చేయకపోయుంటే.. వీరిద్దరూ బాహాబాహీకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా, ఈ వివాదంపై గంభీర్‌ స్పందించాడు. ఆ రోజు ఎందుకలా ప్రవర్తించాడో వెల్లడించాడు.

"ప్రజలందరూ నన్ను విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీతో మీకున్న అనుబంధం ఏంటి అని అడుగుతున్నారు. అందరికీ ఒకటే చెబుతున్నా.. కోహ్లీ, ధోనీ ఇద్దరితో నా రిలేషన్ ఒకేలా ఉంటుంది. నాకు ఇద్దరూ సమానమే. ఒకవేళ మా మధ్య వాగ్వాదం ఉంటే, అది మైదానానికి మాత్రమే పరిమితం. మైదానాన్ని వీడాక దాన్ని పట్టించుకోం. నేను మ్యాచ్ గెలవాలని ఎలా కోరుకుంటానో, వాళ్లు అలానే కోరుకుంటారు. దాన్ని నేను గౌరవిస్తాను.."

"ఇంకా చెప్పాలంటే నేను క్రికెట్ ఫీల్డ్‌లో చాలా గొడవలు పడ్డాను. అయితే ఎందులో కూడా హద్దులు దాటలేదు. టీఆర్పీ రేటింగ్‌ల కోసం మీడియానే దానిని పెద్దది చేసి చూపింది. ఇక ఐపీఎల్ సమయంలో ఏం జరిగిందన్నదానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆరోజు నేను చేసినదాన్ని సమర్థించుకుంటున్నా. నేనెప్పుడు న్యాయం వైపే నిలబడతా. నవీన్ ఉల్ హక్ తప్పు చేయలేదని భావిస్తే.. అతడి వెంట నిలబడటం నా బాధ్యత. అక్కడ అతనున్నా.. మరొకరున్నా.. అదే చేస్తా. మీరు సరైనవారని నేను భావిస్తే.. మీవైపే ఉంటా. నేను ఇదే నేర్చుకున్నా.. దీన్నే కొనసాగిస్తా.." అంటూ కోహ్లీతో వివాదంపై గంభీర్ వివరణ ఇచ్చాడు.

ఆరోజు ఏం జరిగిందంటే..?

వాస్తవానికి కోహ్లీ- గంభీర్ మధ్య గొడవ మొదలైంది అహ్మదాబాద్ వేదికగా కాదు. బెంగుళూరు వేదికగా. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచులో లక్నో చివరి బంతికి విజయం సాధించాక గంభీర్..ఆర్‌సీబీ అభిమానులను ఉద్దేశిస్తూ నోరు మూయాలంటూ సంజ్ఞలు చేస్తాడు. ఆ తరువాత అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచులో ఆ విషయాన్ని కోహ్లీ.. పదే పదే ఎత్తి చూపుతాడు. లక్నో ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేస్తాడు. అందుకు లక్నో ఆటగాడైన నవీన్ ఉల్ హక్ అదే రీతిలో బదులిస్తాడు. ఇక మ్యాచ్‌ అనంతరం కరచాలనం చేసుకునే సమయంలో కోహ్లీ-గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ విరాట్‌, గంభీర్‌కు భారీ జరిమానా విధించింది.