జీఈఎం ద్వారా రూ. 4 లక్షల కోట్ల విలువైన కొనుగోళ్లు

జీఈఎం ద్వారా రూ. 4 లక్షల కోట్ల విలువైన కొనుగోళ్లు

న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ శాఖలు,  విభాగాల నుంచి భారీ కొనుగోళ్ల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వ పోర్టల్ జీఈఎం ద్వారా వస్తువులు, సేవల సేకరణ విలువ రూ. 4 లక్షల కోట్లు దాటిందని  సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు,  విభాగాలు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో వస్తువులు సేవల కొనుగోళ్ల కోసం 2016 ఆగస్టులో గవర్నమెంట్​ ఈ–-మార్కెట్ (జీఈఎం) పోర్టల్​ను ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి 28 నాటికి, సేకరణ విలువ రూ. 4 లక్షల కోట్లు దాటడం చారిత్రాత్మకమని జీఈఎం సీఈఓ పీకే సింగ్ అన్నారు. రక్షణ రంగ కొనుగోలుదారులు ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ నుంచి అనేక వస్తువులు,  సేవలను కొంటున్నారని అన్నారు.  

గుడ్లు సరఫరా చేయడం నుంచి క్షిపణి విడిభాగాల కొనుగోలు వరకు పోర్టల్ ద్వారానే జరుగుతున్నాయని సింగ్ చెప్పారు. 2021–-22లో సేకరణ విలువ రూ. 1.06 లక్షల కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 2 లక్షల కోట్లు దాటింది. పోర్టల్ నుంచి సేవల సేకరణ 2022–-23లో రూ.66 వేల కోట్ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2.05 లక్షల కోట్లకు చేరుకుందని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 28 వరకు ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ నుంచి రూ.1.95 లక్షల కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. వినియోగదారుల కోసం పెద్ద ఎత్తున పోర్టల్‌‌‌‌‌‌‌‌ను తెరవడం గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. ఆఫ్రికా,  ఆగ్నేయాసియాకు చెందిన అనేక దేశాలు జీఈఎం పట్ల ఆసక్తిని కనబరుస్తున్నాయని సింగ్​ తెలియజేశారు. తాము కన్సల్టెన్సీ సేవలను కూడా అందించగలమని, ఇందుకోసం ఇలాంటి ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

అందుబాటులో చాలా సేవలు

క్యాటరింగ్,  వెబ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్ సేవల వంటి ఎన్నికలకు సంబంధించిన  సేవల కోసం పోర్టల్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక పేజీ  ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జమ్మూ అండ్​ కాశ్మీర్, ఒడిశా, బీహార్, అస్సాం,  ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు భారీ ఆర్డర్లను ఇచ్చాయి. జీఈఎంలో 1.5 లక్షల మంది ప్రభుత్వ కొనుగోలుదారులు,  62 లక్షల మంది అమ్మకందారులు ఉత్పత్తులను,  సేవలను అందిస్తున్నారు.

ప్రస్తుతం, ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు,  కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఈ పోర్టల్ ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి అనుమతి ఉంది. పోర్టల్ ఆఫీస్ స్టేషనరీ నుంచి వాహనాల వరకు అనేక రకాల ఉత్పత్తులను ఇది అందిస్తుంది. ఆటోమొబైల్స్, కంప్యూటర్లు  ఆఫీస్ ఫర్నిచర్​ను కూడా ఆర్డర్​చేయవచ్చు. రవాణా, హెలికాప్టర్ సేవల నియామకం, లాజిస్టిక్స్, వ్యర్థాల నిర్వహణ, వెబ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్  విశ్లేషణలతో సహా సేవలు పోర్టల్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.