కాలం మారింది..పని ఒత్తిడిలో కాఫీ బదులు.. కంటెంట్ బ్రేక్!

కాలం మారింది..పని ఒత్తిడిలో కాఫీ బదులు.. కంటెంట్ బ్రేక్!

ఒకప్పుడు ఆఫీసుల్లో పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉద్యోగులు ‘కాఫీ బ్రేక్’ తీసుకునేవారు. క్యాంటీన్ దగ్గరో, కాఫీ మిషన్ ముందో కబుర్లు చెప్పుకుంటూ సేదతీరేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ముఖ్యంగా ‘జెన్ జీ’ ఉద్యోగులు ఆఫీస్ కల్చర్‌‌‌‌ను పూర్తిగా మార్చేస్తున్నారు. వారికి ఇప్పుడు కాఫీ కప్పు కంటే డిజిటల్​ స్క్రీనే ఎక్కువ రిలాక్సేషన్ ఇస్తోంది. దీన్నే ఇప్పుడు ‘కంటెంట్ బ్రేక్’ అని పిలుస్తున్నారు.

కంటెంట్ బ్రేక్ అంటే..

పని మధ్యలో కాఫీ బ్రేక్​ లాగనే ఓ ఐదు నిమిషాలు ఖాళీ దొరికితే చాలు.. వెంటనే స్మార్ట్‌‌‌‌ ఫోన్ తీసి ఇన్‌‌‌‌స్టాగ్రామ్ రీల్స్ చూడటం, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేయడం లేదా నచ్చిన పాడ్‌‌‌‌కాస్ట్ వినడమే ఈ కంటెంట్ బ్రేక్. కాఫీ తాగడం వల్ల వచ్చే ఉత్సాహం కంటే, ఒక ఫన్నీ వీడియో చూడటం వల్ల వచ్చే డోపమైన్ ఇచ్చే కిక్ చాలా ఎక్కువ రిఫ్రెష్‌‌‌‌మెంట్‌‌‌‌ని ఇస్తుందని యూత్​ భావిస్తోంది.

ఎందుకు ఈ మార్పు?

ఆఫీస్ కబుర్లు ఒక్కోసారి గాసిప్స్‌‌‌‌కు దారితీయొచ్చు. అలా కాకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా తమకు నచ్చిన వీడియోలు చూస్తూ సొంత ప్రపంచంలో గడపడానికి జెన్ జీ ఇష్టపడుతున్నారు. దాన్ని వాళ్ల పర్సనల్ స్పేస్.. అని చెప్తున్నారు. అలాగే ఇన్​స్టంట్ ఎంటర్​టైన్​మెంట్​ కోసం రీల్స్ లేదా షార్ట్స్ వంటివి చూడటానికి ఇష్టపడుతున్నారు. అవి క్షణాల్లో నవ్విస్తాయి లేదా కొత్త విషయాలు నేర్పిస్తాయి. తక్కువ సమయంలో ఎక్కువ రిఫ్రెష్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్​ రూట్​ అంటున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఈ కంటెంట్ బ్రేక్స్‌‌‌‌కు ఒక కారణం. దీంతో డిజిటల్ కనెక్టివిటీ కూడా మెరుగవుతుంది. చాలామంది యువ ఉద్యోగులు సోషల్ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి ఇతరులతో మాట్లాడటం కంటే స్క్రీన్‌‌‌‌తో గడపడమే సేఫ్​గా భావిస్తున్నారు. ఈ మార్పును గమనిస్తున్న కొన్ని మోడర్న్​ కంపెనీలు ఆఫీస్​ల్లో హై-స్పీడ్ వైఫైతో పాటు ఉద్యోగులు ప్రశాంతంగా కూర్చుని కంటెంట్ చూసుకోవడానికి ‘సైలెంట్ జోన్స్’ లేదా ‘డిజిటల్ పాడ్స్’ను ఏర్పాటు చేస్తున్నాయి! కెఫిన్ ఇచ్చే బ్రేక్​ కంటే డిజిటల్ డోపమైన్ ఇచ్చే కిక్ జెన్​ జీకి బాగా నచ్చుతోంది.కాఫీ బ్రేక్ అనేది ఒక సామాజిక అనుబంధం అయితే, కంటెంట్ బ్రేక్  ఒక పర్సనల్​ రీఛార్జ్. ఏది ఏమైనా, పని ఒత్తిడి నుంచి బయటపడి మళ్లీ ఉత్సాహంగా పని చేయడమే అసలు లక్ష్యం. కాబట్టి, కాఫీ కప్పుతో అయినా లేదా ఫోన్ స్క్రీన్‌‌‌‌తో అయినా.. ఆ చిన్న బ్రేక్ మాత్రం ప్రతి ఉద్యోగికి అవసరం.