కృష్ణా నదిలో దూకి జెన్​కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య

కృష్ణా నదిలో దూకి జెన్​కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య

హాలియా, వెలుగు: జెన్​కో లో పనిచేస్తున్న ఉద్యోగి  తన భార్య, కొడుకుతో కలిసి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నాగార్జునసాగర్​లో గురువారం జరగగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్​లోని జెన్​కో సంస్థలో పనిచేస్తున్న మందాడి రామయ్య(38)కు భార్య నాగమణి(30), కొడుకు సాత్విక్​(12) ఉన్నారు. ముగ్గురు గురువారం ఉదయం 5 గంటలప్పుడు పైలాన్ కాలనీ సమీపంలోని కొత్త వంతెన వద్దకు వెళ్లారు. ఫోన్, బైక్​ను వంతెనపైనే ఉంచి ముగ్గురు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత బైక్​ను రామయ్యకు చెందినదిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రామయ్య ఇంట్లో తనిఖీ చేయగా తాను కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానని రామయ్య రాసి పెట్టిన సూసైడ్​నోట్​దొరికింది. అందులో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతోనే చనిపోతున్నట్లు రాసి ఉంది. గురువారం సాయంత్రం గజ ఈతగాళ్లతో పోలీసులు కృష్ణా నదిలో గాలింపు చేపట్టగా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం చింతలపాలెం సమీపంలో సాత్విక్, ఏకనాంపేట, జమ్మనకోట సమీపంలో రామయ్య, నాగమణి మృతదేహాలు దొరికాయి. కాగా మృతుడు రామయ్య ఆన్​లైన్ బిజినెస్​లో దాదాపు రూ.8లక్షల వరకు నష్టపోయాడని, అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. రామయ్య తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నరసింహారావు తెలిపారు.

ఆన్​లైన్​ మోసమే కారణమా?
నాగార్జున సాగర్ డ్యాం ఉద్యోగులు, జెన్​కో, ఫార్మా ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు ఆన్ ​లైన్​యాప్​లో పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున మోసపోయారని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. 10 రోజుల క్రితం ఇలా నష్టపోయిన పలువురు నిడమనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు ఆన్​లైన్ యాప్ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. జెన్​కో ఉద్యోగి మందాడి రామయ్య కూడా సుమారు రూ.8లక్షలు నష్టపోయాడని తెలుస్తోంది.