వచ్చేనెల 23, 24 తేదీల్లో సార్వత్రిక సమ్మె

వచ్చేనెల 23, 24 తేదీల్లో సార్వత్రిక సమ్మె
  • కార్మిక సంఘాల నిర్ణయం

ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. వచ్చే నెల 23,24 తేదీల్లో సార్వత్రిక సమ్మె చేయబోతున్నట్లు వెల్లడించాయి కార్మిక సంఘాలు. రైతుల పోరాటంతో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టే.. కార్మికుల హక్కుల కోసం ఆందోళనలు చేస్తామన్నారు నేతలు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యాయి కార్మిక సంఘాలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపాయి. ఫిబ్రవరి 23, 24 రెండ్రోజులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికైనా  కేంద్రం తన నిర్ణయాలను ఉప సంహరించుకోవాలని ఏఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, సీఐటీయూ జాతీయ నేత హేమలత డిమాండ్ చేశారు. 
జాతీయ స్థాయిలో సార్వత్రిక సమ్మెలు జరిగినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని  నేతలు మండిపడ్డారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా కనీస వేతనాలపై ప్రభుత్వాలు ముందుకురాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొడుతున్న వారికి మేలు చేసే పనులు మానేసి.. కార్మికులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కనీస పెన్షన్ 10వేలుగా నిర్ణయించి.. కార్మికులకు అన్ని రకాల బెనిఫిట్స్ అందించాలని సీఐటీయూ రాష్ట్ర నేత సాయిబాబా, టీఎన్ టీయూసీ రాష్ట్ర నేత బోస్ డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరారు.