
న్యూఢిల్లీ: ఆర్మీకి కొత్త బాస్ వచ్చారు. 30వ ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ గా ఉన్న ఆయన.. జనరల్ మనోజ్ పాండే నుంచి ఈ బాధ్యతలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన జనరల్ ఉపేంద్ర ద్వివేది.. రేవాలోని సైనిక్ స్కూల్ లో చదువుకున్నారు. 1981లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. 1984లో జమ్మూకాశ్మీర్ రైఫిల్స్ 18వ బెటాలియన్ లో చేరి ఆర్మీలో అడుగుపెట్టారు.
అప్పటి నుంచి వివిధ హోదాల్లో పని చేశారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు బార్డర్లలో ఏడారి, పర్వత, మైదాన ప్రాంతాల్లో పని చేసిన అనుభవం ఉంది. కాశ్మీర్ లోయ, రాజస్థాన్ ఏడారుల్లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు చేసిన ఎక్స్ పీరియన్స్ కూడా ఉంది. ఆర్మీకి అత్యాధునిక టెక్నాలజీ, ఆయుధాలను అందించడంలో కీలక పాత్ర పోషించారు. పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్ గెలుచుకున్నారు. కాగా, జనరల్ ద్వివేదికి ఎంతో అనుభవం, మంచి ట్రాక్ రికార్డు ఉందని ఆర్మీ ప్రకటనలో పేర్కొంది.
జనరల్ మనోజ్ పాండేకు వీడ్కోలు..
ఇన్ని రోజులు ఆర్మీ చీఫ్గా పనిచేసిన జనరల్ మనోజ్ పాండే ఆదివారం రిటైర్డ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్మీ సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. 2022 ఏప్రిల్ 30న జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. ఆయన మే 30నే రిటైర్ కావాల్సి ఉండగా, కేంద్రం ఒక నెల సర్వీస్ పొడిగించింది.
ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ క్లాస్ మేట్స్..
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి క్లాస్ మేట్స్. ఇద్దరు క్లాస్ మేట్స్ ఇలా ఆర్మీ, నేవీకి చీఫ్ లు గా ఉండడం మిలటరీ చరిత్రలో ఇదే తొలిసారి. వీళ్లిద్దరూ మధ్యప్రదేశ్ రేవాలోని సైనిక్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు సోషల్ మీడియా ‘ఎక్స్’లో వెల్లడించారు.