రూ.2 వేల కోట్లతో జీనోమ్ వ్యాలీ సెకండ్ ఫేజ్

రూ.2 వేల కోట్లతో జీనోమ్ వ్యాలీ సెకండ్ ఫేజ్
  •  300 ఎకరాల్లో ఏర్పాటు చేస్తాం: రేవంత్
  • నల్గొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు
  • పది ఫార్మా విలేజ్​లను ఏర్పాటు చేస్తున్నం
  • రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తయ్
  • 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతది
  • బయో ఏషియా సదస్సు-2024’లో సీఎం వెల్లడి

హైదరాబాద్, వెలుగు: జీనోమ్ వ్యాలీ సెకండ్ ఫేజ్​ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రూ.2వేల కోట్లతో 300 ఎకరాల్లో విస్తరింపజేస్తామన్నారు. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా జిల్లాల్లో పది ఫార్మా విలేజ్​ల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. దీని ద్వారా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని, 5లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో ‘బయో ఏషియా 2024’ సదస్సును ఆయన ప్రారంభించారు.

 ‘డేటా అండ్ ఏఐ రీ డిఫైనింగ్ పాజిబిలిటీస్​’ అనే థీమ్​తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘ఫార్మా విలేజ్​లకు శంషాబాద్ ఎయిర్​పోర్టు నుంచి గంటలోనే చేరుకోవచ్చు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. బయోసైన్స్​కు హైదరాబాద్ రాజధానిగా ఉన్నది. ప్రపంచంలో వినియోగిస్తున్న ప్రతి మూడు వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్​లోనే తయారవుతున్నది’’అని తెలిపారు. 

కలిసికట్టుగా సమస్య పరిష్కరించాలి

ఆరోగ్య భద్రత విషయంలో ప్రపంచంలోని అందరి సమస్యలు ఒకేలా ఉన్నాయనేది కరోనాతో నిరూపితమైందని రేవంత్ అన్నారు. కలిసికట్టుగా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘‘ఐటీ, సాఫ్ట్​వేర్, రీసెర్చ్, స్టార్టప్ రంగాల్లోనూ హైదరాబాద్ టాప్​లో ఉన్నది. ఎంఎస్ఎంఈ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. వ్యాక్సిన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సింగపూర్​కు చెందిన టకేడా సంస్థ ముందుకొచ్చింది. మిల్టెన్యీ కంపెనీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం’’అని తెలిపారు.

‘వన్ నార్త్​’ పేరిట జీనోమ్ వ్యాలీలో

‘వన్ నార్త్​’ పేరుతో జీనోమ్ వ్యాలీలో కంపెనీలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. టెర్మినస్ గ్రూప్ అనే సంస్థ తన అనుబంధ కంపెనీ అయిన ఆర్​ఎక్స్ ప్రొపెల్లెంట్​తో కలిసి దాదాపు 20 లక్షల చదరపు అడుగుల మేర లైఫ్ సైన్సెస్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయనుంది. దీంతో రూ.2వేల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు రావడంతో పాటు అదనంగా రూ.4వేల కోట్ల పరోక్ష పెట్టుబడులు దొరుకుతాయి. 10వేల మందికి ఉపాధి దొరుకుతుంది. జీనోమ్ వ్యాలీలో కెపాసిటీ బిల్డింగ్​కు కట్టుబడి ఉన్నామని టెర్మినస్ గ్రూప్ సీఎండీ ఎస్పీ రెడ్డి తెలిపారు. నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ‘జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ 2024’ అవార్డును అందజేశారు.

కొత్త పాలసీలు తీసుకొస్తున్నం: మంత్రి శ్రీధర్ బాబు

రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్(ఆర్ అండ్ డీ) రంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఫార్మా, ఆర్ అండ్ డీ సెక్టార్లను మరో స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. ‘‘లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి కోసం కొత్త డైనమిక్ పాలసీ తీసుకొస్తున్నాం. ఇది టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, రెగ్యులేటరీ ఏజెన్సీలకు బూస్ట్ ఇస్తుంది. స్కిల్ డెవలప్​మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’అని తెలిపారు.

ఏటా 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లు

సింగపూర్​కు చెందిన టకేడా సంస్థ 20‌‌30 నాటికి ప్రతి ఏడాది 5కోట్లు, పదేండ్లలో పది కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. బయోలాజికల్–ఈతో కలిసి జీనోమ్ వ్యాలీలో తయారీ ప్లాంట్​ ఏర్పాటు చేయనుంది. ‘‘టీఏకే 003’ డెంగ్యూ వ్యాక్సిన్ గ్లోబల్ మార్కెట్​లో రిలీజ్ చేశాం. ఇప్పుడు ఇండియాలోనూ లాంచ్ చేస్తాం. బయోలాజికల్–ఈ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉంది’’అని టకేడా గ్లోబల్ వ్యాక్సిన్ బిజినెస్ యూనిట్ ఎండీ, ప్రెసిడెంట్ గారీ డ్యూబిన్ తెలిపారు. సెల్ అండ్ జీన్ థెరపీ (సీజీటీ) రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు జర్మనీకి చెందిన మిల్టెన్యీ బయోటెక్ సంస్థ ముందుకొచ్చింది.