
ప్రకృతిని దైవంగా పూజించే పండుగ.. మన సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. ఎక్కడైనా పూలతో దేవుడిని పూజిస్తారు. కానీ.. మనదగ్గర మాత్రం ఆ పూలనే దేవతలా పూజిస్తారు. భాద్రపద అమావాస్య నాడు మొదలైన పండుగ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది. ఈ తొమ్మిది రోజులు ఆడపడుచులు కొండంత మురిపెంతో తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి, గౌరమ్మగా కొలిచి.. చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. రేపు చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా..
పండుగ విశేషాలు..
బతుకమ్మ పండుగంటే ఆడపడుచులకే కాదు పిల్లలకు కూడా సంబురమే. కోడి కూత కూయకముందే పిల్లలంతా సంచులు భుజాన వేసుకుని బయల్దేరుతారు. గుట్టలు ఎక్కి, చెలకలు తిరిగి.. గౌరమ్మకు ఇష్టమైన తంగేడు, గునుగు, సీత జడ, నందివర్దనం లాంటి పూలు కోసుకొస్తారు. ఆడపడుచులు వాటితో బతుకమ్మలు పేరుస్తారు. కొత్త చీరలు కట్టుకుని ముస్తాబై.. బతుకమ్మను కొలుస్తూ పాటలు పాడుతూ ఆడతారు. ఈ ఆచారం ఈనాటిది కాదు.. బతుకమ్మకు దాదాపు వెయ్యేండ్ల చరిత్ర ఉంది. పైగా ఇది ప్రకృతితో మమేకమై, ప్రకృతిని కాపాడుకునేందుకు చేసుకునే పండుగ.
ప్రకృతికి మేలు
ఈ పండుగ వర్షాకాలం చివర, చలికాలం మొదలయ్యే టైంలో వస్తుంది. అప్పటివరకు కురిసిన వర్షాలతో చెరువులన్నీ వరద నీటితో నిండి ఉంటాయి. అందులో బ్యాక్టీరియా, క్రిములు లాంటివి డెవలప్ అవుతాయి. అదేటైంలో ప్రకృతిలో రంగు రంగుల పూలు విరగబూస్తాయి. గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, రుద్రాక్ష పువ్వుల్లో ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వాటి నుంచి వచ్చే సువాసనలు పీల్చడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తుంటారు. ఈ పూలతో బతుకమ్మను పేర్చి, చెరువుల్లో వేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయని చెప్తుంటారు.
ఐకమత్యానికి ప్రతీక
బతుకమ్మ పండుగ ఐకమత్యానికి ప్రతీక. కలిసిగట్టుగా పూల కోసం వెళ్లడంతో పిల్లల్లో, కలిసి బతుకమ్మ ఆడడం వల్ల ఆడపడుచుల్లో ఐకమత్యం పెరుగుతుంది. అన్ని పండుగలు ఎవరి ఇండ్లలో వాళ్లే చేసుకుంటారు. బతుకమ్మ పండుగ మాత్రం అందరూ ఒకచోట చేరి చేసుకుంటారు. పైగా కులాలకు అతీతంగా ప్రసాదాలు, వాయినాలు ఇచ్చి, పుచ్చుకోవడం వల్ల అనుబంధాలు పెరుగుతాయి.
ఎలా వచ్చింది?
బతుకమ్మ పండుగ ఎలా మొదలైందో చెప్పే ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణలో నవాబుల కాలంలో మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. భూస్వాముల ఆగడాల వల్ల ఎంతోమంది ఇబ్బందులుపడ్డారు. అలా ఒక అమ్మాయి వాళ్ల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఊరంతా కలిసి ఆమెను కలకాలం ‘‘బతుకమ్మా” అని కీర్తించారట. అప్పటినుంచి భూస్వాముల అకృత్యాలకు బలైపోయిన వాళ్లను, ఆత్మహత్యలు చేసుకున్న మహిళలను స్మరించుకునేందుకు బతుకమ్మ పండుగ చేస్తుంటారని చెప్తుంటారు.
ధర్మాంగదుడు
మరో కథ ప్రకారం.. దక్షిణ భారత దేశాన్ని ధర్మాంగదుడు అనే చోళ రాజు పాలించేవాడు. అతని భార్య సత్యవతి దేవి వంద నోములు చేసి, వందమంది కొడుకులకు జన్మనిస్తుంది. కానీ.. వాళ్లంతా యుద్ధంలో చనిపోతారు. దాంతో మళ్లీ లక్ష్మీ దేవిని పూజించి, ఆ తల్లి అనుగ్రహంతో ఒక కూతురికి జన్మనిస్తుంది. ఆమెకు ‘లక్ష్మి’ అని పేరు పెడతారు. కానీ.. చిన్నప్పటినుంచే ఆమె ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు చావు అంచులదాకా వెళ్తుంది. దాంతో ధర్మాంగదుడు ఆమె పేరుని ‘‘బతుకమ్మ” అని మారుస్తాడు. అప్పటినుండి ఆమె పుట్టిన రోజు నాడు బతుకమ్మ పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
మగవాళ్లు కూడా..
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని తోటపల్లి, గొల్లపల్లి, గాంధీనగర్ గ్రామాల్లో మగవాళ్లు కూడా బతుకమ్మ ఆడే సంప్రదాయం ఉంది. కానీ.. బతుకమ్మ పండుగలో మొదటి రోజు (ఎంగిలిపూల), చివరి రోజు (సద్దుల) మాత్రమే ఆడతారు. ఆడవాళ్లతోపాటే చెరువు దగ్గరకు కూడా వెళ్తారు. ఇది ఏండ్ల నాటి నుంచి వస్తున్న ఆచారం.
వేములవాడలో మొదలై..
వెయ్యి ఏండ్లకు పూర్వమే వేములవాడలో ‘రాజేశ్వరాలయం’ ఎంతో ప్రసిద్ధి చెందింది. చోళ రాజ్యాన్ని రాజ రాజ చోళుడు పాలించే టైంలో అతని కొడుకు రాజేంద్ర చోళుడు వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలోని శివలింగాన్ని తంజావూరికి తీసుకెళ్లాడు. దాన్ని క్రీ.శ. 1010లో నిర్మించిన బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. అందుకే వేములవాడ భీమన్న గుడిలోని శివలింగం, బృహదీశ్వరాలయంలోని శివలింగం ఒకేలా ఉంటాయి. అలా శివలింగాన్ని బృహదమ్మ(పార్వతి) నుంచి వేరుచేసినందుకు తెలంగాణ ప్రజల ఎంతో బాధపడ్డారు.
తమ బాధను చోళులకు తెలిసేలా చేయాలనే ఉద్దేశంతో మేరుపర్వతంలా పూలను పేర్చి బృహతమ్మ (బతుకమ్మ) పండుగ చేయడం మొదలుపెట్టారని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. శివుడు వెళ్లిపోయిన తర్వాత ఇక్కడున్న పార్వతి బాధపడుతోందని భావించిన ప్రజలు తల్లిని ఊరుకోబెట్టే ప్రయత్నంలో భాగంగా పూలతో బతుకమ్మను పేర్చి, పండుగ చేశారని మరికొందరు అంటున్నారు.
దుర్గామాత నిద్రలోకి..
మహిషాసురుడితో దుర్గామాత భీకరంగా పోరాడిందని అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆమె ఆశ్వయుజ పాడ్యమి రోజున అలసటతో గాఢ నిద్రలోకి వెళ్లింది. అప్పుడు భక్తులంతా కలిసి ఆమెను మేల్కొలిపేందుకు పూజలు చేశారు. గౌరీ దేవి అనుగ్రహం కోసం ఆమెకు ఇష్టమైన పూలను ఒకచోట పేర్చారు. అలా తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత దశమి రోజున ఆమె నిద్రలేచిందని, అప్పటినుంచి ప్రతి సంవత్సరం బతుకమ్మ చేయడం ప్రారంభమైందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది.
సద్దుల ప్రసాదం
సద్దుల బతుకమ్మనే పెద్ద బతుకమ్మ అని కూడా ఉంటారు. మిగతా రోజులతో పోలిస్తే సద్దుల రోజు బతుకమ్మని కాస్త పెద్దగా పేరుస్తారు. ఆ రోజు ప్రసాదాలు కూడా ఎక్కువగానే తీసుకెళ్తారు. వాయినాలు ఇచ్చి, పుచ్చుకుంటారు. ముఖ్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, నిమ్మకాయ అన్నం నైవేద్యంగా తీసుకెళ్తారు. కొన్ని ప్రాంతాల్లో మలీద ముద్దలు, గుమ్మడికాయ కూర కూడా తీసుకెళ్తారు.